దేశ ప్రజలకు చల్లటి కబురు అందింది. ఎట్టకేలకు వారం ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. ఈ రుతుపవనాలు శనివారం కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర తెలిపారు. నేటి ఉదయం నుంచి కేరళలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడి నుంచి నెమ్మదిగా దక్షిణ, ఉత్తర భారత దేశానికి విస్తరించనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోకి ఈ నెల 11న ప్రవేశించనున్నాయి. 11న రాయలసీమ మీదుగా ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ నెల 13 నుంచి 15 మధ్య తెలంగాణలోకి ప్రవేశించనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో నాలుగు నెలల పాటు వర్షాలు కురుస్తాయి. గ్రామీణ భారతంలో ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో వ్యవసాయానికి వర్షపునీరే ఆధారం కావడంతో రుతుపవనాల రాక రైతులకు ఆనందాన్నిస్తుంది. రుతుపవనాల రాకతో రానున్న రెండు రోజుల్లో కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జూన్ 9న కొల్లాం, అలప్పుళా జిల్లాలు, జూన్ 10న తిరువనంతపురం, ఎర్నాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆ ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు ఉత్తర, మధ్య భారతంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు.
The Southwest Monsoon has set in over Kerala today, the 8th June 2019.
For more details kindly visit: https://t.co/dnHG35ZgWQ pic.twitter.com/AEvoQNNLG7— India Met. Dept. (@Indiametdept) June 8, 2019