సత్తుపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు హాజరై తిరిగివస్తోన్న వేళ ఆయన ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురైంది. ఎదరుగా వస్తోన్న కారును గుర్తించని సండ్ర కారు డ్రైవర్ దానిని తప్పించబోయాడు. అదే సమయంలో పక్కనే ఉన్న కాలువను గుర్తించకపోవడంతో సండ్ర ప్రయాణిస్తోన్న కారు అందులోకి జారిపోయింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రమాదం తప్పినట్లైంది. కాగా వాహనం ఒరుగుతున్న సమయంలోనే సండ్ర, ఆయన గన్‌మెన్‌లు కిందకు దిగేశారు. ఆ శివుడే తన ప్రాణాలను కాపాడారని వ్యాఖ్యానించిన సండ్ర, ఆ తరువాత తన ప్రయాణాన్ని కొనసాగించారు.