బీజేపీ కుట్రలు పన్నుతోంది…: మంత్రి కేటీఆర్
దుబ్బాక ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని నీచమైన రాజకీయాలకు పాల్పడుతోంది. గత 22 రోజులుగా ఎన్నో కుట్రలు, పన్నాగాలు పన్నిన బీజేపీ చివరికి డబ్బు పంచడానికి కూడా సిద్ధమైంది. ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు దొరికాయి.
Minister KTR : మరికొన్ని గంటల్లో దుబ్బాకలో పోలింగ్ జరుగుతుందనగా.. తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డీజీపీని కలిశారు టీఆర్ఎస్ నేతలు. రేపు తెలంగాణలో అల్లర్లు బీజేపీ నేతలు ప్లాన్ చేసినట్లు కంప్లెంట్‌లో వివరించారు. దాన్ని అడ్డుకోవాలంటూ.. డీజీపీకి తెలిపారు. ఏం జరగబోతుంది? మరికొన్ని గంటల్లో దుబ్బాకలో పోలింగ్ జరగబోతుంది? అంతకంటే ముందు తెలంగాణలో అలజడి రేగనుందా? హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగనున్నాయా? కమలం పార్టీ ఇందుకోసం ప్లాన్ చేసిందా.. అంటే అవుననే అంటున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
అయితే ప్రగతి భవన్.. లేదంటే డీజీపీ ఆఫీస్ ముట్టడికి రేపు కమలం శ్రేణులు.. ప్రణాళిక రచించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తాము ముందే పసిగట్టామని చెప్తున్న కేటీఆర్.. దుబ్బాక పోలింగ్ సవ్యంగా జరిగేలా చూడాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు వివరించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని టీఆర్ఎస్ పార్టీ తరఫున లేఖ రాశామన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
‘దుబ్బాక ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని నీచమైన రాజకీయాలకు పాల్పడుతోంది. గత 22 రోజులుగా ఎన్నో కుట్రలు, పన్నాగాలు పన్నిన బీజేపీ చివరికి డబ్బు పంచడానికి కూడా సిద్ధమైంది. ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు దొరికాయి. తాజగా నేడు దుబ్బాక వెళ్తున్న కోటి రూపాయల నగదును హైదరాబాద్‌లో పట్టుబడ్డాయి. ఈ డబ్బులు ఎవరివి అనేవి పోలీసులు ఇప్పటికే నిర్థారించారు. అంతేకాదు బీజేపీ అభ్యర్థి చేయి విరిగిందని అసత్య ప్రచారాలు మొదలుపెట్టారు. తిమ్మిని బమ్మి చేయడం బీజేపీకి బాగా అలవాటు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి ఇంట్లోనే డబ్బులు దొరికాయన్నది అందరికి తెలిసిన విషయమే. ఈ విషయంపై గోబెల్స్ ఇష్టారాజ్యంగా ప్రచారం చేస్తూ ప్రజలను ఆగమాగం చేయాలని చూస్తున్నారు.
నేడు బీజేపీ కార్యలయం ముందు ఎవరో వ్యక్తి ఆత్మహత్యహత్నం చేసుకున్నాడని ప్రచారం మొదలుపెట్టారు. ఇలా ఉప ఎన్నిక ముగిసేవరకు ప్రగతి భవన్, తెలంగాణ భవన్, డీజీపీ కార్యాలయం లాంటివి ఎంచుకొని ముట్టడి కార్యక్రమాలు చేపట్టనున్నారని మాకు విశ్వసనీయ సమాచారం. శాంతి భద్రతల విఘాతం కలిగేలా రక్తపాతం, లాఠీచార్జ్, ఫైరింగ్‌కు బీజేపీ ప్రోత్సహిస్తుంది. ఈ విషయంలో మేము చీఫ్ ఎలక్షన్ కమిషన్‌ను కలవాలని నిర్ణయించాం. ఇప్పటికే చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు లేఖను కూడా రాశాము.. అలాగే ఇక్కడ సీఈఓని కూడా కలవనున్నాం అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాగా దుబ్బాక ఉప ఎన్నిక నవంబర్ 3న జరుగనున్నాయి. ఉప ఎన్నిక ఫలితాలు నవంబర్ 10న వెలువడనున్నాయి.