AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్వ‌చ్ఛ తెలంగాణ‌గా తీర్చిదిద్దడమే ప్రధాన ల‌క్ష్యంః కేటీఆర్

వ్య‌ర్థాల నుంచి సంప‌ద సృష్టించ‌డం మంచి ప‌రిణామం అని, ఈ విష‌యంలో హైద‌రాబాద్ ఆద‌ర్శంగా నిలుస్తుంద‌ని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు

స్వ‌చ్ఛ తెలంగాణ‌గా తీర్చిదిద్దడమే ప్రధాన ల‌క్ష్యంః కేటీఆర్
Balaraju Goud
|

Updated on: Nov 07, 2020 | 3:54 PM

Share

వ్య‌ర్థాల నుంచి సంప‌ద సృష్టించ‌డం మంచి ప‌రిణామం అని, ఈ విష‌యంలో హైద‌రాబాద్ ఆద‌ర్శంగా నిలుస్తుంద‌ని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ మహానగరంలోని జీడిమెట్ల‌లో భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాల రీసైక్లింగ్ ప్లాంట్‌ను మంత్రులు కేటీఆర్, మ‌ల్లారెడ్డితో క‌లిసి శ‌నివారం ఉద‌యం ప్రారంభించారు. రూ.10 కోట్ల‌తో 500 టీపీడీ సామ‌ర్థ్యం క‌లిగిన రీసైక్లింగ్ ప్లాంట్‌ను బ‌ల్దియా నిర్మించిన భవనానికి శ్రీకారం చుట్టారు.

విశ్వనగరంలో హైదరాబాద్ మహానగరాన్ని తీర్చి దిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి కేటీఆర్. హైద‌రాబాద్ అందాన్ని చెడ‌గొట్టే విధంగా చెత్త‌కుప్ప‌లు పేరుకుపోతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆ వ్య‌ర్థాల‌ను తొల‌గించేందుకు బ‌ల్దియా ఆధ్వర్యంలో బృహత్తర కార్యక్రమం చేపట్టిందన్నారు. ఆ ప్ర‌క్రియ‌లో భాగంగానే రూ. 10 కోట్ల‌తో క‌న్‌స్ర్ట‌క్ష‌న్ అండ్ డిమాలిషింగ్ ప్లాంట్‌ను జీడిమెట్ల‌లో ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. సంక్రాంతి పండుగ రోజు ఎల్బీన‌గ‌ర్ పరిధిలోని ఫ‌తుల్లాగూడ‌లో మ‌రో సీ అండ్ డీ ప్లాంట్‌ను ప్రారంభించబోతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. వీటితో పాటు రాబోయే రోజుల్లో న‌గ‌రానికి తూర్పు, ప‌శ్చిమ దిశ‌ల్లో కూడా మ‌రో రెండు ప్లాంట్ల‌ను ఏర్పాటు చేస్తామ‌ని వెల్లడించారు. జీవ‌న ప్ర‌మాణాలు మెరుగ‌య్యేందుకు ఈ ప్లాంట్లు దోహ‌దం చేస్తాయ‌ని న‌మ్ముతున్నాన‌ని తెలిపారు.

జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ ఫ్లాంట్.. ద‌క్షిణ భార‌త‌దేశంలోనే ఇది అతిపెద్దదని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. దేశంలో ఇది ఐదో ప్లాంట్ అని తెలిపారు. అత్యాధునిక టెక్నాల‌జీతో దీన్ని నిర్మించారు. ఈ ప్లాంట్ ప‌రిస‌రాల్లో ఉండేవారికి ఎలాంటి ఇబ్బందులు కలుగువన్న మంత్రి… సాలిడ్ వేస్ట్ విష‌యంలో జీహెచ్ఎంసీ చాలా చ‌ర్య‌లు తీసుకుంటుందన్నారు. జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ కు రోజుకు 6 వేల ట‌న్నుల చెత్త‌ను త‌ర‌లించి ప్రాసెస్ చేస్తున్నామ‌ని తెలిపారు. న‌గ‌రంలో 2 వేల ఎంఎల్‌డీల సివ‌రేజ్‌, డ్రైనేజీ ఉత్ప‌త్తి అవుతుంటే.. 41 శాతాన్ని ఎస్టీపీల ద్వారా శుద్ది చేసి మూసీలోకి వ‌దులుతున్నాం. ఎస్టీపీల‌ సంఖ్య‌ను పెంచుతున్నామ‌ని తెలిపారు. సీ అండ్ డీ ప్లాంట్ ద్వారా బ‌యాల‌జిక్ వేస్ట్ అంటే జీవ వ్య‌ర్థాల‌ను పీసీబీ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. డిస్పోజ్ చేస్తున్నాం. హాస్పిట‌ల్‌, న‌ర్సింగ్ హోంల‌లో ఉత్ప‌త్తి అయ్యే బ‌యోమెడిక‌ల్ వేస్ట్‌ను శాస్త్రీయంగా డిస్పోజ్ చేస్తున్నామ‌ని మంత్రి వివరించారు.

ప్ర‌తి మున్సిపాలిటీలో మానవ వ్య‌ర్థాల‌ను శుద్ధి చేసే ప్లాంట్ల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. ఈ వ్య‌ర్థాల వ‌ల్ల‌ ప్ర‌జ‌ల‌కు, ప‌ర్యావ‌ర‌ణానికి హానిక‌రం క‌ల‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల ఆరోగ్యం, భ‌విష్య‌త్‌ను దృష్టిలో పెట్టుకుని పథకాలను అమలు చేస్తామని కేటీఆర్ తెలిపారు. కాంప్ర‌హెన్షివ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పాల‌సీని కూడా త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌బోతున్నాం. క్లీన్ టెక్నాల‌జీలో తెలంగాణ అగ్ర‌భాగాన ఉండాల‌నే సంక‌ల్పంతో ముందుకెళ్తున్నాం. స్వ‌చ్ఛ తెలంగాణ‌ను త‌యారు చేయ‌డ‌మే ల‌క్ష్యమన్న కేటీఆర్ ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. దీంతో భ‌విష్య‌త్ త‌రాల‌కు మెరుగైన హైద‌రాబాద్‌ను ఇచ్చిన వాళ్లం అవుతామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు.