AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

#GHMC Elections: పూర్వ వైభవం కోసం ఉవ్విళూరుతోన్న మజ్లిస్‌

హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు ఎప్పుడు ఎన్నికలు జరిగినా మజ్లిస్‌ తన సత్తా చాటుకుంటూనే వస్తోంది. గ్రేటర్‌గా అవతరించినప్పుడు కూడా మజ్లిస్‌ తన హవాను ఏమాత్రం తగ్గకుండా చూసుకుంది..

#GHMC Elections: పూర్వ వైభవం కోసం ఉవ్విళూరుతోన్న మజ్లిస్‌
Balu
| Edited By: Ravi Kiran|

Updated on: Dec 01, 2020 | 1:19 PM

Share

హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు ఎప్పుడు ఎన్నికలు జరిగినా మజ్లిస్‌ తన సత్తా చాటుకుంటూనే వస్తోంది. గ్రేటర్‌గా అవతరించినప్పుడు కూడా మజ్లిస్‌ తన హవాను ఏమాత్రం తగ్గకుండా చూసుకుంది.. ఎన్నిక ఏదైనా పక్కా వ్యూహాంతోనే బరిలో దిగుతుంది.. ఈసారి మాత్రం తన పూర్వ వైభవాన్ని తిరిగి సంపాదించుకునే ప్రణాళికతో ఉంది.. గ్రేటర్‌ హైదరాబాద్‌లో మజ్లిస్‌ బలం బలగం అంతా పాతబస్తీనే! అలాగని మూసీ ఇవతల పోటీ చేయదని కాదు.. ఇక్కడా మజ్లిస్‌ పోటీ చేస్తున్నది.. 51 డివిజన్‌లలో పోటీ చేస్తున్న మజ్లిస్‌ హాఫ్‌ సెంచరీ కొట్టాలని టార్గెట్‌గా పెట్టుకుంది.. అందుకే గెలిచే స్థానాలను మాత్రమే ఎంపిక చేసుకుంది.. గెలుపు గుర్రాలనే బరిలో దింపింది.. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూలంగా ఉంటుందనే ముద్రను ప్రచారంలోనే చేరిపివేసుకుంది.. బీజేపీ విసిరిన విమర్శలకు ఘాటుగానే బదులిచ్చింది.. ప్రచారంలో ప్రతీ సందును కవర్‌ చేశారు మజ్లిస్‌ అభ్యర్థులు.. విజయం సాధిస్తే ఏం చేయదలుచుకున్నారో చెప్పుకొచ్చారు.. టీఆర్‌ఎస్‌తో ఎలాంటి పొత్తు లేదని స్పష్టం చేశారు.. టీఆర్‌ఎస్‌ మొత్తం అన్ని డివిజన్‌లలో పోటీ చేస్తుండటమే ఇందుకు కారణమన్నారు మజ్లిస్‌ నేతలు.. దాంతో పాటు టీఆర్‌ఎస్‌పై విమర్శలు కూడా చేశారు. తాము తల్చుకుంటే రెండు నెలల్లోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూలిపోతుందనే వరకు వెళ్లారు.. ఈ వ్యాఖ్యలకు టీఆర్ఎస్‌ నుంచి కౌంటర్‌ వచ్చిందనుకోండి..అలాగే మంత్రి కేటీఆర్‌పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.. అసలు కేటీఆర్‌కు ఏ మాత్రం అనుభవం లేదని అన్నారు. మొత్తం మీద టీఆర్‌ఎస్‌ తమకు ఫ్రెండ్‌ కాదని ఈ ఎన్నికల్లో రుజువు చేసుకున్నది మజ్లిస్‌.. ఇక తమకు ప్రధాన శత్రువు బీజేపీనే కాబట్టి ఆ పార్టీపై చాలా దూకుడుగా వ్యవహరించింది.. బీజేపీ చేసిన వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్‌ ఇచ్చుకుంటూ వచ్చింది. బీజేపీ సంధించే విమర్శలను తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేసింది. పాతబస్తీపై సర్జికల్ స్ట్రయిక్‌ చేస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకుంది మజ్లిస్‌. ఆ పార్టీ నేతలంతా దీన్ని ప్రచారంలో బాగా ఉపయోగించుకున్నారు. గత ఎన్నికల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్‌ 99 స్థానాలను గెల్చుకుంది.. దీంతో ఆ పార్టీకి ఎవరి అండదండలు అవసరం లేకుండా పోయాయి.. సొంతంగానే మేయర్‌ పదవిని సంపాదించుకుంది.. అయితే అంతకు ముందు పరిస్థితి వేరు.. అప్పట్లో కాంగ్రెస్‌పార్టీకి ఎక్కువ స్థానాలను రాకపోవడంతో మజ్లిస్‌ సాయం అవసరమయ్యింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకన్న మజ్లిస్‌ రెండున్నరేళ్లు మేయర్‌ పదవిని కాంగ్రెస్‌తో పంచుకుంది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వస్తే బాగుండని కోరుకుంటోంది మజ్లిస్‌. టీఆర్‌ఎస్‌కు తక్కువ సీట్లు వస్తే తప్పనిసరిగా సాయం కోరుతుందని, అప్పుడు మేయర్‌ పీఠాన్ని డిమాండ్‌ చేయవచ్చన్నది మజ్లిస్‌ భావన. అది జరగాలంటే పోటీ చేస్తున్న 51 స్థానాలలో 50 స్థానాలు గెలవాలి.. ఆ లక్ష్యంతోనే మజ్లిస్‌ ముందుకు వెళుతోంది. మరి మజ్లిస్‌ అభిలాష్‌ నెరవేరుతుందో లేదో చూడాలి..