వివాదంలో ఐపీఎల్ క్రికెటర్.. శశాంక్ సింగ్ తోపాటు కుటుంబసభ్యులపై కేసు నమోదు!
ఐపీఎల్ క్రికెటర్ శశాంక్ సింగ్, అతని తండ్రి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శైలేష్ సింగ్ ఒక వివాదంలో చిక్కుకున్నారు. వారిద్దరితో పాటు వారి డ్రైవర్ తనపై దాడి చేసి, అసభ్యంగా ప్రవర్తించారంటూ ఒక యువకుడు పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు క్రీడా, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాధితుడు వారి ఇంట్లో వంటవాడిగా పనిచేసేవాడని, తనను దారుణంగా కొట్టి ఇంటి నుండి బయటకు గెంటేశారని ఆరోపించాడు.

ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని రేవా ప్రాంతానికి చెందిన విపేంద్ర సింగ్ అనే యువకుడు వంటవాడిగా పనిచేస్తుంటాడు. ఒక బంధువు ద్వారా భోపాల్‌కు వచ్చిన అతడిని, నెలకు 15,000 రూపాయల జీతంపై శైలేంద్ర సింగ్ ఇంట్లో వంట మనిషిగా నియమించారు. జూన్ 25వ తేదీన అతను నీల్‌బాద్‌లోని శైలేంద్ర సింగ్ నివాసానికి పని నిమిత్తం వచ్చాడు. ఆ ఇంట్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారితో పాటు అతని భార్య, కుమార్తె, ఐపీఎల్ క్రికెటర్ శశాంక్ సింగ్ నివసిస్తున్నారు.
పనిలో చేరినప్పటి నుండి కుటుంబ సభ్యులు తన పనిని తప్పుబడుతూనే ఉండేవారని, అంతేకాకుండా తన మొబైల్ ఫోన్‌ను లాక్కున్నారని విపేంద్ర ఆరోపించాడు. జూన్ 28వ తేదీ ఉదయం 9 గంటల ప్రాంతంలో టిఫిన్ తయారు చేసిన తర్వాత, బాధితుడు తన మొబైల్ ఫోన్ తిరిగి ఇవ్వాలని శైలేంద్ర సింగ్‌ను కోరాడు. అయితే ఆయన ఫోన్ ఇవ్వడానికి నిరాకరించడంతో తీవ్ర వివాదం చెలరేగింది.
ఫోన్ ఇవ్వకపోవడంతో విపేంద్ర కోపంతో తన గదిలోకి వెళ్ళిపోగా.. శైలేంద్ర సింగ్, అతని కుమారుడు శశాంక్ సింగ్, వారి డ్రైవర్ మిశ్రా కలిసి గదిలోకి ప్రవేశించారు. ముగ్గురూ కలిసి తనను తీవ్రంగా దూషిస్తూ, దాడికి పాల్పడి, బలవంతంగా ఇంటి నుండి బయటకు నెట్టేసినట్లు బాధితుడు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నాడు. కేవలం దాడి చేయడమే కాకుండా, తన మొబైల్ ఫోన్ నుండి వసతి, భోజనం ఖర్చుల పేరుతో 1000 రూపాయలను కూడా బలవంతంగా బదిలీ చేసుకున్నారని విపేంద్ర అదనపు ఆరోపణ చేశాడు. ఈ ఘటన అనంతరం భయపడిపోయిన బాధితుడు, తన బంధువుతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
విపేంద్ర సింగ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఇరు పక్షాల వాంగ్మూలాలను రికార్డ్ చేస్తున్నామని, ఘటనకు సంబంధించిన వాస్తవాలను ధృవీకరించిన తర్వాత చట్టపరమైన తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
మరిన్ని క్రైమ్ వార్తలను ఇక్కడ క్లిక్ చేయండి..