‘నాకు చదువుకోవాలని ఉంది.. న్యాయం చేయండి..’ పోలీసులను కదిలించిన బాలుడి ఫిర్యాదు!
గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో వింత ఫిర్యాదు అందింది. ఓ 15 ఏళ్ల బాలుడు చేసిన ఫిర్యాదు కలకలం రేపింది. తనను దత్తత తీసుకున్న తల్లిదండ్రులతో పాటు కన్న తల్లిదండ్రులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్పీ కార్యాలయానికి వచ్చాడు బాలుడు. తనకు చదువుకునే అవకాశం కల్పించాలని వేడుకోవడం అక్కడి అధికారులను కదిలించింది.

బాలుడు సాకేత్ ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదవాల్సిన వయస్సులో ఉన్నాడు. తన ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం.. ఏడాది వయస్సులో ఉండగా వరుసకు బాబాయి, పిన్ని అయిన సురేశ్, మీనాలు తనను దత్తత తీసుకున్నారని పేర్కొన్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు మాత్రమే ఉండటంతో తనను చట్టబద్ధంగా దత్తత తీసుకున్నారని, అందుకు సంబంధించిన పత్రాలను కూడా పోలీసులకు సమర్పించాడు. తన కన్న తల్లిదండ్రులు శ్రీదేవి, రమేశ్ కాగా, వారికి మరో ఇద్దరు కుమారులు ఉన్నారని వివరించాడు.
అయితే గత ఏడేళ్లుగా దత్తత తల్లిదండ్రులు తనను సరిగా చూసుకోవడం లేదని, తాను చెడు అలవాట్లకు బానిసయ్యానని ఆరోపిస్తూ ఇంటి నుంచి పంపించేశారని బాలుడు వాపోయాడు. ఆ తర్వాత ఆశ్రయం కోసం కన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లినా వారు కూడా తనను అంగీకరించలేదని తెలిపాడు. దీంతో ప్రస్తుతం క్యాటరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, అయినప్పటికీ తనకు చదువుకోవాలనే కోరిక ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంపై ఇప్పటికే నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎస్పీ దృష్టికి తీసుకొచ్చాడు. తన భవిష్యత్తు దృష్ట్యా కన్న, దత్తత తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.
బాలుడి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఘటనను సీరియస్‌గా పరిగణించారు. దత్తతకు సంబంధించిన పత్రాలను పరిశీలించడంతో పాటు, రెండు కుటుంబాలకు చెందిన సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే బాలుడు చేసిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, వాస్తవాలను నిర్ధారించిన అనంతరం చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..