తెలుగు రాష్ట్రాల్లో చలిగాలులు ప్రజలను వణికిస్తున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి తీవ్రత బాగా పెరుగుతోంది. తెలంగాణలో సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రాత్రి టెంపరేచర్లు 6 డిగ్రీలు తక్కువగా ఉంటున్నాయని వాతావరణ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. చలిగాలులతోపాటు పొగమంచు కురుస్తుండటంతో ప్రజలు బయటకి రావడానికి జంకుతున్నారు.
మొన్నటివరకు అతిభారీ వర్షాలు ముంచెత్తాయి. ఎటు చూసినా నీటి నిల్వలే. నదులు నిండుగా ప్రవహిస్తున్నాయి. చెరువులు ఫుల్లుగా ఉన్నాయి. దీనికి తోడు ఉత్తర ఈశాన్యం నుంచి చలిగాలులు వీస్తుండడంతో చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు అతి దారుణంగా పడిపోతున్నాయి. అటు ఉత్తర ఈశాన్యం నుంచే కాదు.. తూర్పు నుంచి కూడా తేమగాలులు స్టార్ట్ అవబోతున్నాయి. అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని గిన్నెధరి గ్రామంలో 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలంలో 8 డిగ్రీలు, నిర్మల్ జిల్లాలోని కుభీర్‌లో 8.9 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం కాస్లాబాద్‌లో 9.4, మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం భాగ్యనగర్ నందనవనం ప్రాంతంలో 9.8 డిగ్రీలు, జిన్నారంలో 9.9డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగత్రలు నమోదయ్యాయి. గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేని విధంగా నవంబర్‌లో హైదరాబాద్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. బేగంపేట్‌లో 12.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. 1964 నవంబర్ 26న 7.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత ఇప్పటికీ రికార్డుగా ఉంది. దాని తర్వాత ఈ సీజన్ సిటిజన్లను భయపెడుతోంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా చలికాల్చుకు తింటోంది. ముఖ్యంగా విశాఖ మన్యం చలికి గజగజ వణుకుతోంది. చింతపల్లిలో 9.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం, సాయంత్రం మంచు దట్టంగా కురుస్తోంది. గిరిజన గ్రామాల్లో ఉదయం పది గంటల వరకు మంచు వదలడం లేదు. దీంతో ప్రతి ఇంటా చలి మంటలు వెలుగుతున్నాయి. అటు డిసెంబర్, జనవరి నెలల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయంటున్నారు అధికారులు.