బాబోయ్.. ఇది అందమైన పక్షి అనుకుంటే పొరపాటే.. నిలువునా ప్రాణం తీసే కిల్లర్!
విషపూరితమైన జీవులు అనగానే మనకు పాములు, తేళ్లు లేదా అరుదైన కప్పలు మాత్రమే గుర్తుకువస్తాయి. కానీ, రెక్కలు విప్పి నింగిలో ఎగిరే పక్షుల్లో కూడా ప్రాణాంతకమైన విషం ఉంటుందని మీకు తెలుసా? ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ఏకైక పక్షిగా ఒకటి ఉంది.. ఈ పక్షి ఈకలను లేదా చర్మాన్ని తాకినా చాలు ప్రాణం పోవాల్సిందే..తట్టుకోలేనంతగా చేతులు మొద్దుబారడం, మంట, తిమ్మిర్లు భాదిస్తాయి. అందుకే వేటగాళ్లు, శత్రు జీవులు దీని జోలికి వెళ్లవు. అలాంటి ప్రాణాంతక పక్షి గురించి ఇప్పుడు చూద్దాం..

ప్రపంచంలో మనుషులు చూసి పారిపోయే ప్రమాదకరమైన జీవులు చాలా ఉన్నాయి. కానీ, అనుభవజ్ఞులైన వేటగాళ్లు సైతం ముట్టుకోవడానికి భయపడేంత విషపూరితమైన పక్షి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అవును, అలాంటి పక్షి ఒకటి నిజంగా ఉంది. దాని పేరు హుడెడ్ పిటోహుయ్. దీనిని ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పక్షిగా పరిగణిస్తారు. ఈ పక్షి ఈకలు, చర్మం,శరీరంలో ప్రాణాంతకమైన విషం ఉంటుంది
ఇండోనేషియా, పాపువా న్యూగినియాలోని దట్టమైన వర్షారణ్యాల్లో ఈ పక్షులు నివసిస్తాయి. 1990వ దశకంలో పరిశోధకుడు జాక్ డంబాచర్ పరిశోధనలు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఈ పక్షి ఈకలను, చర్మాన్ని తాకారు. వెంటనే ఆయన చేతులు మొద్దుబారడం, నాలుకపై మంట, వ్రమైన తిమ్మిరి రావడం గమనించి, దీనిపై శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించి ఇది విషపూరిత పక్షి అని నిర్ధారించారు.
ఈ పక్షికి విషం ఎక్కడి నుండి వస్తుంది?:
హుడెడ్ పిటోహుయ్ పక్షి తన శరీరంలో సొంతంగా విషాన్ని ఉత్పత్తి చేసుకోదు. ఇది అడవిలో తినే మెలిరిడ్ బీటిల్స్ నే విషపూరితమైన పురుగుల ద్వారా ఈ విషాన్ని తన శరీరంలోకి గ్రహిస్తుంది. ఈ టాక్సిన్ దాని చర్మం మరియు ఈకల్లో పేరుకుపోతుంది.
శత్రువుల నుండి ఆత్మరక్షణ:
ఈ పక్షిలోని బ్రాటకోటాక్సిన్ ఎంత శక్తివంతమైనదంటే, దక్షిణ అమెరికాలోని పాయిజన్ డార్ట్ కప్పల్లో లభించే విషం లాంటిదే ఇది. ఈ పక్షి ఇతర జీవులపై దాడి చేయడానికి విషాన్ని ఉపయోగించదు. కానీ, దీని ఒంటిపై ఉండే నలుపు, రింజ రంగులు శత్రువులకు నేను విషపూరితమైనదాన్ని అని హెచ్చరిక సంకేతాన్ని ఇస్తాయి. వేటగాళ్లు లేదా పెద్ద క్రూర పక్షులు దీనిని తినడానికి ప్రయత్నిస్తే తీవ్రమైన పారాలసిస్ లేదా శ్వాసకోశ నిరోధకత ఏర్పడుతుంది. అందుకే స్థానిక వేటగాళ్లు కూడా ఈ పక్షిని తాకడానికి సాహసించరు.




