కొత్త గ్యాస్ కనెక్షన్ కావాలనుకునేవారికి ఊహించని షాక్.. సిలిండర్లపై కేంద్రం సంచలన నిర్ణయం..
వంటింట్లో గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుని ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారా? ఎన్నిసార్లు అప్లై చేసినా బుకింగ్ కావడం లేదా? దీని వెనుక అంతర్జాతీయ సంక్షోభం దాగి ఉంది. మార్చి 2026 నుంచి దేశంలో 14.2 కిలోల సాధారణ గృహ సిలిండర్ కనెక్షన్లపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. మరి కొత్త కనెక్షన్ అవసరమైన వారు ఏం చేయాలి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి మార్గంలో కొనసాగుతున్న వివాదాలు భారత గ్యాస్ సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో దేశంలో 14.2 కిలోల ఎల్పీజీ కొత్త కనెక్షన్ల జారీపై గ్యాస్ కంపెనీలు తాత్కాలికంగా ఆంక్షలు విధించాయి. దీంతో కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్న సాధారణ ప్రజలకు నిరాశే ఎదురవుతుంది. మార్చి 2026 నుంచి ఎలాంటి కొత్త డొమెస్టిక్ సిలిండర్ కనెక్షన్లు జారీ చేయడం లేదని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న కనెక్షన్లకే ఇబ్బంది లేకుండా చూసేందుకు కేంద్రం ప్రాధాన్యతనిస్తోంది. పాత కనెక్షన్లు ఉన్న వినియోగదారులకు మాత్రమే రీఫిల్ సిలిండర్ల సరఫరాను కొనసాగిస్తున్నారు. నిలిచిపోయిన పాత కనెక్షన్లను పునరుద్ధరించడంతో పాటు, నకిలీ కనెక్షన్లను ఏరివేసేందుకు ఈ కేవైసీ ప్రక్రియను ముమ్మరం చేశారు.
ఈ పరిణామాలపై కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల దృష్ట్యా కొత్త ఎల్పీజీ కనెక్షన్లపై విధించిన ఈ నిషేధం కేవలం తాత్కాలిక చర్య మాత్రమేనని వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న కస్టమర్లకు నిరంతరాయంగా గ్యాస్ సిలిండర్లు అందించడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని, పరిస్థితులు చక్కబడిన వెంటనే కొత్త కనెక్షన్ల జారీని తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. అయితే పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి వల్ల భవిష్యత్తులో ఎన్ని షిప్పులు భారత్‌కు గ్యాస్ సరఫరాతో చేరగలవో కచ్చితంగా చెప్పలేమని, సరఫరా పరిస్థితి దీర్ఘకాలం ఇలాగే స్థిరంగా ఉంటుందని భావించలేమని ఫెడరేషన్ ఆఫ్ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి పవన్ సోనీ ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో 60 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడేది. అందులోనూ 90 శాతం వరకు గ్యాస్ సరఫరా హోర్ముజ్ జలసంధి మీదుగానే దేశానికి చేరేది. ప్రస్తుత సంక్షోభం కారణంగా ఆ మార్గంలో సరఫరా తగ్గడంతో దేశీయంగా గ్యాస్ ఉత్పత్తిని పెంచినప్పటికీ పూర్తిస్థాయి డిమాండ్‌ను అందుకోవడం సవాలుగా మారింది. దీంతో ప్రత్యామ్నాయంగా భారత్ తన అవసరాల్లో ఏకంగా 67 శాతం ఎల్పీజీని సుదూర సముద్ర మార్గం గుండా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటోంది. పశ్చిమాసియాతో పోలిస్తే అమెరికా నుంచి వచ్చే గ్యాస్ ప్రయాణ సమయం ఎక్కువ కావడంతో పాటు రవాణా వ్యయం తడిసిమోపెడవుతోంది.
కొత్త కనెక్షన్లు రాని వినియోగదారులకు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. తాత్కాలికంగా 5 కిలోలు లేదా 10 కిలోల కాంపోజిట్ సిలిండర్లను తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా పెద్ద నగరాల్లో అందుబాటులోకి తెచ్చిన 10 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్లను సులభంగా బుక్ చేసుకుని అవసరాలను తీర్చుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
