భరించలేని పంటినొప్పితో ఆస్పత్రికి పరిగెత్తిన 11ఏళ్ల బాలిక.. ఎక్స్‌రే చూసి అందరూ షాక్! దవడల నిండా..
సాధారణంగా, పెద్దవారి నోటిలో 32 దంతాలు, పిల్లల నోటిలో 20 దంతాలు ఉంటాయి. కానీ కొన్నిసార్లు, ప్రకృతి వైద్య ప్రపంచాన్ని సైతం ఆశ్చర్యపరిచే అద్భుతాలను చూపిస్తుంది. అలాంటి ఒక విచిత్రమైన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తీవ్రమైన పంటి నొప్పితో బాధపడుతున్న 11ఏళ్ల బాలిక డాక్టర్ వద్దకు వెళ్లగా, ఎక్స్-రేలో కనిపించిన దృశ్యాన్ని ఎవరూ ఊహించలేకపోయారు. అది చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

సాధారణంగా ఏడేళ్ల వయస్సు దాటిన పిల్లల్లో లేదా పెద్దవారిలో గరిష్టంగా 32 దంతాలు ఉండటం సహజం. కానీ, బ్రెజిల్‌కు చెందిన ఒక 11 ఏళ్ల చిన్నారి విషయంలో వైద్యులు ఊహించని వింత సంఘటనను చూసి అవాక్కయ్యారు. ఆమె నోటిని పరీక్షించిన దంత వైద్యులకు ఏకంగా 81 దంతాలు కనిపించడం వైద్య ప్రపంచంలో తీవ్ర సంచలనంగా మారింది. నోటిలో తీవ్రమైన నొప్పి, దంతాల అమరిక సరిగ్గా లేకపోవడంతో చిన్నారిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరీక్షల అనంతరం వైద్యులు ఎక్స్-రే తీయగా అందులోని దృశ్యాలు చూసి డాక్టర్లు సైతం షాక్‌కు గురయ్యారు. ఆమెకు దవడల నిండా అదనపు దంతాలు వరుసలు తీరి నిండిపోయి ఉన్నాయి. వీటిలో 18 పాల దంతాలు, 32 శాశ్వత దంతాలు, 31 అదనపు దంతాలు ఉన్నాయి.
సాధారణం కంటే ఎక్కువ దంతాలు పెరిగే ఈ పరిస్థితిని హైపర్‌డాంటియా అంటారు. చాలా సందర్భాలలో ఒకటి లేదా రెండు అదనపు దంతాలు ఉంటాయి. కానీ 30 కంటే ఎక్కువ అదనపు దంతాలు ఉండటం అత్యంత అరుదు. ప్రపంచ జనాభాలో కేవలం 1శాతం నుండి 4శాతం మందిలో మాత్రమే ఇటువంటి అరుదైన జన్యుపరమైన లేదా అభివృద్ధి సంబంధిత లోపాలు కనిపిస్తాయి. ఈ కేసు 2011లో అమెరికన్ జర్నల్ ఆఫ్ ఆర్థోడాంటిక్స్ అండ్ డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్‌లో ప్రచురించబడింది. ఇటీవలి సంవత్సరాలలో సోషల్ మీడియాలో మళ్లీ వెలుగులోకి వచ్చిన తర్వాత చర్చనీయాంశంగా మారింది.
నోటిలో ఇన్ని దంతాలు ఉండటం వల్ల నమలడం, మాట్లాడటంలో తీవ్ర అసౌకర్యం కలగడమే కాకుండా దవడ ఎముకలపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుందని వైద్యులు వెల్లడించారు. ఈ సమస్యకు పరిష్కారంగా వివిధ దశల్లో శస్త్రచికిత్సలు నిర్వహించి, అదనపు దంతాలను తొలగించి బాలిక దవడల అమరికను సాధారణ స్థితికి తీసుకురావడానికి డెంటిస్టుల బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.




