Livestock Smuggling : నాగర్ కర్నూలు జిల్లాలో పశువుల అక్రమ రవాణా కలకలం రేపుతోంది. అత్యంత దారుణంగా పశువులను కృష్ణా నది దాటిస్తున్నారు స్థానిక దళారులు. కొల్లాపూర్ మండలం సోమశిల నుండి పశువులను అత్యంత క్రూరంగా, ప్రమాదకరంగా రవాణా చేస్తున్నారు.
ఇటు సోమశిల వైపునుంచి అటు సిద్దేశ్వరం వరకు కృష్ణానది నీటిలోనే దాదాపుగా రెండు కిలోమీటర్ల మేర ఇలా లాక్కుంటూ వెళ్తున్నారు. రెండు కీలోమీటర్ల మేర గంటకు పైగా అవి నీటిలో విలవిలలాడుతూనే ప్రయాణం సాగిస్తున్నాయి. మూతికి తాళ్లు కట్టి ఆ తాళ్లకు తెప్పకు కట్టి లాక్కపోతున్నారు దళారులు.
ఇది ప్రతిరోజు జరుగుతున్నా అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. వీటిని తరలించడానికి రోడ్డు మార్గం ద్వారా దూరం పెరగడంతో ఇలా ప్లాన్ చేశారు. వీరికి కొంత మంది స్థానికుల సహాయ సహకారులు ఉన్నట్లు తెలుస్తోంది.
పశువులను ఈ విధంగా తరలించడానికి పడవల యజమానులతో లక్షల రూపాయల ఒప్పందం చేసుకుంటున్నారు. ఈ రవాణా మొత్తం తెల్లవారుజామున లేకపోతే.. అర్థరాత్రి సమయంలో రవాణా జరుగుతోంది. దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ వస్తున్నాయి. జీవహింస జరిపై వారిపై కఠినంగా వ్యవహరించాలని అంటున్నారు స్థానికులు.