దేవరగట్టు బన్నీ ఉత్సవానికి ముహూర్తం ఖరారు
సరా వచ్చిందంటే అక్కడి భక్తుల్లో భక్తి కట్టలు తెంచుకుంటుంది. కర్రలు స్వైర విహారం చేస్తాయి. ఉత్సవ విగ్రహాల కోసం 11 గ్రామాల ప్రజలు రణరంగమే సృష్టిస్తారు.

దసరా వచ్చిందంటే అక్కడి భక్తుల్లో భక్తి కట్టలు తెంచుకుంటుంది. కర్రలు స్వైర విహారం చేస్తాయి. ఉత్సవ విగ్రహాల కోసం 11 గ్రామాల ప్రజలు రణరంగమే సృష్టిస్తారు. కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరానికి సమయం ఆసన్నమైంది. హోళగుంద మండలం దేవరగట్టు మాల మల్లేశ్వరస్వామి దసరా బన్నీ ఉత్సవాల ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 21 నుంచి 30 వరకు ఉత్సవాలను నిర్వహించాలని ఆలయ కమిటీ సభ్యులు నిర్ణయించారు. 26 అర్ధరాత్రి బన్నీ ఉత్సవం కర్రల సమరం జరపాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
కర్నూలు జిల్లాలో దసరా సందర్భంగా దేవరగట్టుకొండ ప్రాంతంలోని పదకొండు ఊళ్ల ప్రజలు సంప్రదాయబద్ధంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. అక్కడి ఆచారం ప్రకారం దేవరగట్టు కొండలో మాళ మల్లేశ్వరస్వామి కళ్యాణోత్స్వం సందర్భంగా బన్నీ ఉత్సవం జరుగుతుంది. ఇందులో 11 గ్రామాలకు చెందిన వారు రెండు వర్గాలుగా విడిపోతారు. ఒక వర్గం వారు విగ్రహాల్ని తీసుకొని వెళుతుంటే.. వారిని ఆపే ప్రయత్నం చేయటం.. సంప్రదాయంగా జరగాల్సిన తీరులోనే విగ్రహాల్ని తిరిగి దేవరగట్టు మీద ఉంచటంతో ఉత్సవం పూర్తి అవుతుంది. అయితే.. ఈ సందర్భంలో పదకొండు ఊళ్లకు చెందిన వారు పెద్ద పెద్ద కర్రలతో రెండు జట్లుగా విడిపోయి.. బన్నీ ఆటను ఆడతారు. లయబద్ధంగా సాగే ఈ భారీ ప్రక్రియను కర్రలతో సమరంగా జరుపుకుంటారు. ఈ ఆటను ప్రాచీన కళారూపంగా అక్కడి స్థానికుల సెంటిమెంట్లకు గౌరవంగా భావిస్తారు.




