Kisan Brand Urea: రామగుండం ఎరువుల కర్మాగారం ట్రయల్ రన్ సిద్ధమైంది. రూ. 6,120 కోట్ల వ్యయంతో ఏటా 12.5 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో చేపట్టిన కర్మాగారం పనులు దాదాపు పూర్తయ్యాయి. రోజూ 2,200 టన్నుల అమ్మోనియా, 3,850 టన్నుల యూరియాను ఇక్కడ ఉత్పత్తి చేయనున్నారు. కరోనా కారణంగా నాలుగు నెలలపాటు వలస కూలీలు అందుబాటులో లేకపోవడంతో పనులు కాస్త నెమ్మదించాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు అనుకూలిస్తుండడంతో సంక్రాంతి నాటి నుంచి కిసాన్ బ్రాండ్ యూరియా మార్కెట్‌లోకి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలను అధికారులు మొదలుపెట్టారు.
రామగుండం ఎరువుల కర్మాగారం పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ 2020 మే నెలలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో రైతులకు కావాల్సిన ఎరువుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ యాసంగికే ఎరువులు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ ఉత్పత్తి చేసే యూరియాను 50 శాతం తెలంగాణ ప్రాంతానికి మిగతా 50 శాతం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు కేటాయించాలని సూచించారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ ద్వారా ‘కిసాన్ బ్రాండ్ యూరియా’ పేరుతో జనవరి 15 నుంచి ఉత్పత్తి ప్రారంభించేందుకు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు అధికారులు.
వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కర్మాగారంలో రోజూ 3,850 టన్నుల చొప్పున ఏటా 13 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఏటా 7 లక్షల 92 వేల టన్నుల అమ్మోనియా లక్ష్యంగా రోజూ 2,200 టన్నులు ఉత్పత్తి చేయనున్నారు. ఇందులో 6.5 లక్షల టన్నులను తెలంగాణ రైతుల వ్యవసాయ అవసరాలకు, మిగతా యూరియాను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరఫరా చేస్తారు.