తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ గురువారం ఢిల్లీకి వెళుతున్నారు. ఉన్నట్లుండి సీఎం ఢిల్లీ పర్యటనకు సిద్ధమవడంతో తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది కాలంగా బిజెపి అధిష్టానంతోను, కేంద్ర ప్రభుత్వ పెద్దలతోను అంటీముట్టనట్లు వుంటూ వస్తున్న సీఎం కెసీఆర్.. ఉన్నట్లుండి హస్తిన పర్యటనకు రెడీ అవడంతో ఏదో పెద్ద విషయం వుండే వుంటుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. నిజానికి 2014లో అధికారం చేపట్టిన నుంచి అటు నరేంద్ర మోదీ, ఇటు కేసీఆర్.. పరిణితి చెందిన రాజకీయాలను ప్రదర్శించారు. పరస్పరం సహకరించుకునే ధోరణితోనే అయిదేళ్లు గడిపారు. అయితే 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన కెసీఆర్.. బిజెపిపై ఘాటైన విమర్శలకు దిగారు. కేంద్రం నుంచి ఆశించిన సహకారం లభించలేదని కుండబద్దలు కొట్టారు. దాంతో బిజెపి నేతలు భగ్గుమన్నారు. అప్పట్నించి మొన్నటి పార్లమెంటు ఎన్నికల దాకా బిజెపి, టిఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగింది. పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి అనూహ్యంగా నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుని తెలంగాణలో గులాబీ పార్టీకి కమలమే ప్రత్యామ్నాయం అన్న సంకేతాలిచ్చారు. అదే ధోరణిలో తరచూ ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ఒకరిద్దరు నేతలు గులాబీ గూటిని వీడి కమలం తీర్థం పుచ్చుకోవడం కూడా ఇరు పార్టీల నేతల మధ్య గ్యాప్ పెంచింది.
దాంతో ఇటీవల ఢిల్లీలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సుకు కూడా కెసీఆర్ హాజరు కాకుండా తెలంగాణ ప్రభుత్వం తరపున హోం మంత్రి మహమూద్ అలీని పంపించారు. దాంతో బిజెపి పెద్దలను కల్వడం కెసీఆర్ కు అంతగా ఇష్టం లేదని విశ్లేషకులు అంచనా వేశారు. ఇలాంటి పరిస్థితిలో ఢిల్లీ వెళ్ళేందుకు కెసీఆర్ సిద్దపడడం.. అది కూడా ఎలాంటి స్పెషల్ అకేషన్ లేకుండా ప్లాన్ చేసుకోవడం రాజకీయ వర్గాలతోపాటు పరిశీలకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
గురువారం ఢిల్లీ వెళ్ళనున్న కెసీఆర్… శుక్రవారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కల్వనున్నారు. అయితే.. ఈ భేటీకి సంబంధించిన ఎజెండాతోపాటు ఢిల్లీలో ఇంకెవరితో కెసీఆర్ భేటీ అవుతారన్నది, సమాలోచనలు జరుపుతారన్నది తెలియాల్సి వుంది. అయితే ప్రధాన మంత్రితో భేటీలో మాత్రం పలు కీలకాంశాలను కెసీఆర్ ప్రస్తావిస్తారని సమాచారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను యురేనియం తవ్వకాల అంశం వణికిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టును, సర్వేను రద్దు చేయాలని సీఎం.. ప్రధానిని కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో పాలమూరు ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కెసీఆర్ భావిస్తున్న నేపథ్యంలో దానికి ఆర్థిక సాయం కోరే అవకాశం వుంది. హైదరాబాద్ మెట్రోను విస్తరించాలని భావిస్తున్న క్రమంలో కేంద్రం కూడా సహకరించాలని అభ్యర్థించే అవకాశం కనిపిస్తోంది.
ఇక మరోవైపు ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా అక్టోబరు 5న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. మోదీతో భేటీలో ఏపీ ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు సహా పలు అంశాలపై చర్చించే అవకాశముంది. కాగా ఏపీ ఇప్పుడు తీవ్ర ఆర్థికలోటులో ఉంది. నిధుల విషయంలో కూడా జగన్ మోదీని అభ్యర్థించనున్నట్లు సమాచారం గత నెలలోనూ ఢిల్లీలో పర్యటించారు సీఎం జగన్. ఆగస్టు 6న ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు వరుస రోజుల్లో ప్రధాని మోదీని కలవబోతుండడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇటీవల కేసీఆర్, జగన్ హైదరాబాద్‌లో సమావేశమై ప్రధానంగా కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు కేంద్రం సాయం చేయాల్సిందిగా ఇరువురు సీఎంలు మోదీని కోరే అవకాశముంది.