జపాన్ ‘ట్విటర్ కిల్లర్’ టకహిరోకు మరణ శిక్ష, టోక్యో కోర్టు తీర్పు, కిక్కిరిసిపోయిన న్యాయస్థానం హాలు
జపాన్ లో 'ట్విటర్ కిల్లర్' గా పేరు మోసిన టకహిరో షిరైషీకి టోక్యో కోర్టు మరణ శిక్ష విధించింది. ఒక మహిళతో సహా 9 మందిని నిర్దాక్షిణ్యంగా హతమార్చిన ఇతనికి ఈ శిక్షే తగినదని కోర్టువ్యాఖ్యానించింది. 30 ఏళ్ళ టకహిరో తన నేరాన్ని అంగీకరించాడు. ట్విటర్ ద్వారా..
జపాన్ లో ‘ట్విటర్ కిల్లర్’ గా పేరు మోసిన టకహిరో షిరైషీకి టోక్యో కోర్టు మరణ శిక్ష విధించింది. ఒక మహిళతో సహా 9 మందిని నిర్దాక్షిణ్యంగా హతమార్చిన ఇతనికి ఈ శిక్షే తగినదని కోర్టువ్యాఖ్యానించింది. 30 ఏళ్ళ టకహిరో తన నేరాన్ని అంగీకరించాడు. ట్విటర్ ద్వారా తాను పరిచయం చేసుకునో, లేదా తనకు పరిచయమైనవారినో టార్గెట్లుగా చేసుకుని వారిని అంతమొందిస్తూ వచ్చాడు. వారి ముఖాలను చెక్కి వేయడం, శరీర భాగాలను బాక్సుల్లో పెట్టి ‘భద్ర పరచడం’ వంటి అమానుషాలకు టకహిరో పాల్పడేవాడట..15 ఏళ్ళ నుంచి 26 ఏళ్ళ మధ్య వయస్సుగలవారిని ఇతగాడు తన బలిపశువులుగా చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోగోరిన వారిని వారి అంగీకారంతోనే తన క్లయింటు అంతమొందించాడని, అందువల్ల అతనికి జైలుశిక్ష విధించాలని టకహిరో తరఫు లాయర్ కోర్టును కోరాడు. కానీ కోర్టు ఈ వాదనను అంగీకరించలేదు. బాధితులెవరూ తమ అంగీకారాన్ని కనీసం మౌనంగానైనా తెలపలేదని రికార్డుల ద్వారా స్పష్టమైందని న్యాయమూర్తి పేర్కొన్నారు.
పలువురు యువకుల జీవితాలు ఇలా అంతం కావడం అత్యంత దారుణమని జడ్జి వ్యాఖ్యానించారు. ఇతని కేసు విచారణ జరిగే కోర్టులో ప్రజల కోసం కేవలం కొన్ని సీట్లు మాత్రమే ఉన్నప్పటికీ 435 మంది కోర్టు తీర్పును ఆలకించడానికి అక్కడికి చేరుకున్నారు. సూసైడ్ చేసుకోగోరినవారికి తాను సాయపడతానని, అవసరమైతే తను కూడా ఆత్మహత్య చేసుకుంటానని టకహిరో నమ్మబలికేవాడట ! 2017 లో పోలీసులు ఇతడిని అరెస్టు చేశారు. 23 ఏళ్ళ యువతి మిస్సింగ్ కేసును పురస్కరించుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు టోక్యో శివార్లలోని ఇతని ఇంటిని సోదా చేసి షాక్ తిన్నారు. శరీర భాగాలు, తలలు వేరు చేసిన తొమ్మిది మొండేలు వారికి కనిపించాయి. మూడు కూలర్ బాక్సులు, 5 కంటెయినర్లలో వీటిని చూసి తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. తనను ‘తలారి’ గా చెప్పుకునే టకహిరో తన అపార్ట్ మెంటుకు వారిని రప్పించి అంతమొందించే వాడట.
నేరగాళ్లకు మరణశిక్ష విధించే ధనిక దేశాల్లో జపాన్ కూడా ఒకటి. దీనికి ప్రజల మద్దతు కూడా ఎక్కువగానే ఉంది. గత ఏడాది డిసెంబర్లో నలుగురు కుటుంబ సభ్యులను హత్య చేసిన ఓ చైనీయుడికి ఉరిశిక్ష విధించారు. కాగా ట్విటర్ కిల్లర్ కి కోర్టు విధించిన మరణశిక్ష తాలూకు పత్రాలపై జపాన్ న్యాయ శాఖ మంత్రి సంతకం చేయగానే అతడిని ఉరి తీస్తారు.