ఏపీవ్యాప్తంగా రాజధాని అంశం సెగలు రేపుతోంది. మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చిన నుంచి గత 9 రోజులుగా అమరావతి ఏరియా ప్రజలు, రైతులు ఉద్యమం కొనసాగిస్తూనే వున్నారు. ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటన తర్వాత స్పందించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆ తర్వాత కనిపించలేదు.
ఆయన తన కుటుంబంతో వెకేషన్‌కు వెళ్ళారని ప్రచారం జరిగింది. తాజాగా వేకేషన్ ముగించుకుని హైదరాబాద్ వచ్చిన జనసేనాని.. బాక్సింగ్ డే నాడు రంగంలోకి దిగారు. జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని గురువారం పార్టీ సీనియర్ల భేటీలో నిర్ణయించారు.
ఈ నెల 30వ తేదీన పవన్ కళ్యాణ్ అధ్యకతన సమావేశం జరుగుతుంది. ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి ముఖ్య నేతలంతా రావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. జనసేన పొలిట్ బ్యూరో, రాజకీయ వ్యవహారాల కమిటీ, పార్టీ వ్యూహాత్మక కమిటీ, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ, ముఖ్య నేతలు హాజరు కావాలని ఆదేశించారు జనసేనాని.
ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులు, అమరావతి గ్రామాల ప్రజలు, రైతుల ఆందోళన, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల ఆశలు, ఆకాంక్షలు, రాష్ట్ర సమగ్రత వంటి అంశాలను విస్తృత స్థాయి సమావేశానికి ఎజెండాగా ఖరారు చేశారు. జనసేన స్టాండ్, పార్టీ పరంగా నిర్వహించవలసిన కార్యక్రమాలు తదితర అంశాలపై కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు పవన్ కల్యాణ్ సిద్దమవుతున్నారు.
ఒకవైపు మూడు రాజధానుల ప్రతిపాదనను పవన్ కల్యాణ్ వ్యతిరేకిస్తుంటే.. ఆయన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి మాత్రం మూడు రాజధానుల ప్రతిపాదనను స్వాగతించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు సమాన స్థాయిలో అభివృద్ధి చెందేందుకు ఈ ప్రతిపాదన దోహదపడుతుందని చిరంజీవి అభిప్రాయపడ్డారు. దీంతో అమరావతి ఏరియా ప్రజల్లో చిరంజీవిపై చులకన ఏర్పడగా.. పవన్ కల్యాణ్ చరిష్మా పెరిగిందని పరిశీలకు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా 30వ తేదీన జనసేన పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఇపుడు ఆసక్తికరంగా మారింది.