వైజాగ్ ఫార్మాసిటీ గ్యాస్ లీకేజ్ ఘటనపై పవన్ స్పందన..

|

Jun 30, 2020 | 3:44 PM

విశాఖపట్నం జిల్లా పరవాడ ఫార్మా సిటీలో చోటు చేసుకున్న దుర్ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు జనసేన పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

వైజాగ్ ఫార్మాసిటీ గ్యాస్ లీకేజ్ ఘటనపై పవన్ స్పందన..
Follow us on

విశాఖపట్నం జిల్లా పరవాడ ఫార్మా సిటీలో చోటు చేసుకున్న దుర్ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఫార్మాసిటీలో చోటు చేసుకున్న ఘటన చాలా బాధాకరమన్న ఆయన.. మృతుల కుటుంబాలకు జనసేన పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాష్ట్రంలో అన్ని రసాయన పరిశ్రమల్లో తక్షణమే సేఫ్టీ అడిట్ చేపట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ కోరారు.

ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… ‘విశాఖపట్నం జిల్లా పరవాడ ఫార్మా సిటీలో ఉన్న సాయినార్ లైఫ్ సైన్సెస్ సంస్థలో విష వాయువులు విడుదలై ఇద్దరు మృతి చెందారని, మరో అయిదుగురు అస్వస్థతకు లోనయ్యారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ వల్ల చోటు చేసుకున్న దుర్ఘటన ఇంకా కళ్ల ముందే ఉంది. కొద్ది రోజుల కిందటే నంద్యాలలోని ఎస్.పి.వై. ఆగ్రో ఇండస్ట్రీస్‌లో విషవాయువు వెలువడి ఒకరు మృత్యువాతపడ్డారు. ఇంతలోనే సాయినార్ సంస్థలో విషవాయువులకు ఇద్దరు బలి కావడం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఆసుపత్రిలో ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించాలి.

రాష్ట్రంలోని రసాయన పరిశ్రమల్లో రక్షణ చర్యలు ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని జనసేన చెబుతూనే ఉంది. ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదు? విశాఖపట్నం దగ్గర ఆర్.ఆర్.వెంకటాపురం చుట్టుపక్కల ప్రాంతాలు ఎల్జీ పాలిమర్స్ నుంచి వచ్చిన విషవాయువులతో ఎలా నష్టపోయాయో చూశాం. 12 మంది మృత్యువాతపడ్డారు. ఎంతోమంది ఆసుపత్రుల పాలై ఇప్పటికీ అనారోగ్యంతో ఉన్నారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై ఉన్నతాధికారులతో చేపట్టిన విచారణలో కూడా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదు.

రాష్ట్రంలోని అన్ని రసాయన పరిశ్రమల్లో తక్షణమే సేఫ్టీ ఆడిట్ చేపట్టాలి. నిబంధనలు పాటించకుండా ఉద్యోగులు, సమీప ప్రాంత ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకుంటున్న ఈ తరహా ప్రమాదాలపై నిపుణుల కమిటీతో విచారణ చేపట్టాలి. పరిశ్రమల ప్రమాద ఘటనల్లో మృతి చెందినవారికి అందరికీ ఆమోదయోగ్యమైన పరిహారం ఇచ్చి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Also Read: కుల ధృవీకరణ లేకుండానే మైనారిటీలకు ‘వైఎస్ఆర్ చేయూత’…