అక్టోబర్ తొలివారంలో అపెక్స్ కౌన్సిల్ భేటీ
గత నెలలో జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి మరోసారి తేదీ ఖరారు అయ్యింది. అక్టోబర్ తొలివారంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.
గత నెలలో జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి మరోసారి తేదీ ఖరారు అయ్యింది. అక్టోబర్ తొలివారంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ భేటీకి హాజరు కావాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యాలయం సమాచారం అందించింది. గతంలోనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాల్సినప్పటికీ గజేంద్రసింగ్ షెకావత్‌కు కరోనా సోకడంతో వాయిదా పడింది. దీంతో తాజాగా మళ్లీ సమావేశ తేదీని ఖరారు చేశారు.
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నేతృత్వంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిలతో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖ ఉన్నతాధికారలు పాల్గొనే అవకాశ ఉంది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోని జలవివాదాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పోతిరెడ్డిపాడు, కాళేశ్వరం ప్రాజెక్టులపై ఇప్పటికే ఇరు రాష్ట్రాలు కేంద్రానికి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. మరోవైపు కౌన్సిల్ భేటీ జరిగేవరకు రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం ఆపాలని ఇప్పటికే కేంద్ర మంత్రి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు.
అయితే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నదీజలాల వివాదాల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. 2016లో తొలిసారిగా అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు లేవనెత్తిన అంశాలను ఈ కౌన్సిల్ సమావేశంలో చర్చించి సమస్య పరిష్కార మార్గాలను కేంద్రం సూచిస్తుంది. అయితే, కేంద్ర సమాచారంపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించాల్సి ఉంది.