కరోనా వైరస్ వ్యాధి కలిగించే శక్తిని కోల్పోతోందా..?

కరోనా వైరస్ తో బాధపడుతున్న దేశాలకు ఇటలీ వైద్యుల శుభవార్త. క్రమంగా నావల్ కొవిడ్ 19 శక్తిని కోల్పోతుందంటూ ప్రకటించారు

కరోనా వైరస్ వ్యాధి కలిగించే శక్తిని కోల్పోతోందా..?

కరోనా వైరస్ తో అతలాకుతలం అవుతున్న దేశాలకు ఇటలీ వైద్యులు ఓ శుభవార్తను మోసుకొచ్చారు. క్రమ క్రమంగా నావల్ కొవిడ్ 19 శక్తిని కోల్పోతుందంటూ ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాధిని కలిగించే శక్తిని కోల్పోతోందని, వైరస్ వల్ల ప్రాణాహాని కలిగే అవకాశం చాలా వరకూ తగ్గిందని ఇటలీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త అన్నారు. రెండు నెలల క్రితం నాటి పరిస్థితితో పోలిస్తే రోగుల నుంచి ఇటీవల సేకరించిన శాంపిళ్లలో వైరస్ కణాల సంఖ్య భారీగా పడిపోయిందని మిలాన్‌లోని శాన్ రఫేల్ ఆస్పత్రి చీఫ్ ఆల్బర్టో జాంగ్రిల్లో తెలిపారు. వాస్తవంగా వైద్యపరిభాషలో చెప్పాలంటే ఇటలీ నుంచి వైరస్ మాయమైనట్టే అని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా మరణాల పరంగా ఇటలీ ప్రపంచలోనే మూడో స్థానంలో కొనసాగుతోంది. ఫిబ్రవరి 21న అక్కడ కరోనా అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకూ ఇటలీలో 33 వేల పైచిలుకు కరోనా మరణాలు నమోదయ్యాయి. కేసుల పరంగా చూస్తే 2 లక్షల పైగా పాజిటివ్ కేసులతో ప్రపంచంలో ఇటలీ ఆరవ స్థానంలో ఉంది. మేనెలలో ఇటలీలో కరోనా మరణాలు, కొత్త కేసులు నమోదవడం నెమ్మదించడంతో దేశంలో ఆంక్షలు ఎత్తివేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంపై కరోనా రెండో సారి విరుచుకుపడే అవకాశం ఉందని కొందరు నిపుణులు అనవసరంగా ఆందోళన చెందుతున్నట్టు ఆల్బర్టో వెల్లడించారు. వాస్తవ పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటూ ఆయా దేశాధినేతలు నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు.