AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పింక్ బాల్ టెస్ట్: టెస్ట్ చరిత్రలో టీమిండియా అత్యల్ప స్కోర్.. 46 ఏళ్ల ఆ చెత్త రికార్డు బ్రేక్.!!

పింక్ బాల్ టెస్టులో పూర్తిగా విఫలమైన టీమిండియా పలు చెత్త రికార్డులను మూటగట్టుకుంది. ఓవర్‌నైట్ 9/1 స్కోరుతో ఈ రోజు ఆట ప్రారంభించిన..

పింక్ బాల్ టెస్ట్: టెస్ట్ చరిత్రలో టీమిండియా అత్యల్ప స్కోర్.. 46 ఏళ్ల ఆ చెత్త రికార్డు బ్రేక్.!!
Ravi Kiran
|

Updated on: Dec 19, 2020 | 1:07 PM

Share

India Vs Australia 2020: గొప్పగా ఆడినప్పుడు పొగడ్తలు, చెత్తగా ఆడినప్పుడు తెగడ్తలు తప్పవు.. అది విరాట్‌ కోహ్లీ అయినా ఇంకెవరైనా భరించక తప్పదు.. లిమిటెడ్‌ ఓవర్లల మ్యాచుల్లో ఆస్ట్రేలియాతో సమ ఉజ్జీగా ఆడినందుకు, వన్డేల లెక్కను టీ-20ల లెక్కతో సరిసమానం చేసినందుకు కాసింత సంబరపడ్డాం.. పర్వాలేదులే, టెస్ట్‌ల్లో గట్టిపోటీ ఇస్తుందనుకున్నాం..! అయితే సీన్ రివర్స్ అయింది. టీమిండియా మరీ ఇలా చేతులెత్తుస్తుందని ఊహించలేదు. మన ఆటగాళ్లు 46 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న చెత్త రికార్డును బ్రేక్‌ చేస్తారని, ఇలా 36 పరుగులకే చాప చుట్టేస్తారని కల్లో కూడా అనుకోలేదు.

టీమ్‌ అంతా బలంగా ఉంది! పింక్‌బాల్‌తో కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు అంటుంటే.. అది టీమిండియా ప్లేయర్ల లాంటివాళ్లకు కాదని ధైర్యం చెప్పుకున్నాం.. కానీ ఒక్కరంటే ఒక్కరూ 50 బంతులు ఆడిన పాపాన పోలేదు.. డబుల్ డిజిట్స్ మాట అటుంచితే.. అందరూ కూడా సింగల్ డిజిట్స్‌కే పెవిలియన్ బాట పట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు చేసిన బౌండరీలు నాలుగంటే నాలుగే! ఇలా పింక్ బాల్ టెస్టులో పూర్తిగా విఫలమైన టీమిండియా పలు చెత్త రికార్డులను మూటగట్టుకుంది.

ఓవర్‌నైట్ 9/1 స్కోరుతో ఈ రోజు ఆట ప్రారంభించిన భారత్ టాప్ ఆర్డర్.. ఆసీస్ బౌలర్ల ధాటికి ఒక్కసారిగా పేక మేడలా కుప్ప కూలిపోయింది. 36 పరుగులకే ఆలౌట్ అయింది. దీనితో కోహ్లీసేన పలు చెత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. 1974లో భారత్ ఇంగ్లాండ్ చేతిలో 42 పరుగులకు ఆలౌట్ అయింది. ఇప్పటిదాకా టీమిండియా పేరిట టెస్టుల్లో ఉన్న అత్యల్ప స్కోర్ ఇదే. అయితే ఇప్పుడు దాన్ని కోహ్లీసేన తిరగరాసింది. అలాగే 1924లో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ తర్వాత.. ఇన్నాళ్లకు ఒక ఇన్నింగ్స్‌లో ఏ బ్యాట్స్‌మెన్ కూడా రెండంకెల స్కోర్ చేయకుండా పెవిలియన్ చేరడం విశేషం.

టెస్ట్ క్రికెట్‌లో అత్యల్ప స్కోర్లు ఇవే…

26; న్యూజిలాండ్ వెర్సస్ ఇంగ్లాండ్ – 1955

30; దక్షిణాఫ్రికా వెర్సస్ ఇంగ్లాండ్ – 1896

30; దక్షిణాఫ్రికా వెర్సస్ ఇంగ్లాండ్ – 1924

35; దక్షిణాఫ్రికా వెర్సస్ ఇంగ్లాండ్ – 1899

36; ఆస్ట్రేలియా వెర్సస్ ఇంగ్లాండ్ – 1902

36; దక్షిణాఫ్రికా వెర్సస్ ఆస్ట్రేలియా – 1932

36; ఇండియా వెర్సస్ ఆస్ట్రేలియా – 2020

38; ఐర్లాండ్ వెర్సస్ ఇంగ్లాండ్ – 2019

42; ఇండియా వెర్సస్ ఇంగ్లాండ్ – 1974

ఒక ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోర్ చేయని టెస్టులు…

30 ఆలౌట్; దక్షిణాఫ్రికా వెర్సస్ ఇంగ్లాండ్ – 1924( అత్యధిక స్కోర్: హెర్బి టేలర్ -7(ఎక్స్‌ట్రాలు – 11)

36 ఆలౌట్; ఇండియా వెర్సస్ ఆస్ట్రేలియా – 2020( అత్యధిక స్కోర్: మయాంక్ అగర్వాల్ – 9)