Increased Flood Tide in Godavari River : ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో గోదారమ్మ పురుగులు పెడుతోంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నదీ ప్రవాహం భారీగా పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మంగళవారం సాయంత్రానికి 25 అడుగులకు చేరింది. మంగళవారం ఉదయం 7 గంటలకు గోదావరి ప్రవాహం 24 అడుగుల వద్ద ఉండగా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వరద ప్రవాహాలతో గోదావరి నీటిమట్టం సాయంత్రానికి 25 అడుగులకు చేరుకున్నట్లుగా అధికారులు ప్రకటించారు.
గోదావరి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎం.వీ.రెడ్డి మండల స్థాయి అధికారులను అప్రమత్తం చేశారు. నదీని దాటకుండా ఉండేందుకు ప్రజలను అలెర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. చెర్లలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ప్రవాహాలు పెరిగాయి. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 74 మీటర్లు కాగా మంగళవారం సాయంత్రానికి 72.32 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 22949 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పది గేట్లు 5 ఫీట్ల మేర ఎత్తి దిగువకు 24,308 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.