Spider Monkey: ఆ ఊళ్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. ఊరందరికి ప్రీతిపాత్రమైన ఓ జీవి ప్రాణాలు విడువగా.. అందరి కళ్లు చమర్చాయి. ఇన్ని రోజులు చెంగుచెంగునా ఎగురుకుంటూ… అందరికీ ప్రశాంత వాతావరణం కలిగించిన అందరి స్నేహితుడు దూరమయ్యాడు. ఇదంతా ఏదో మనిషి గురించి కాదు.. ఊరికి కోతుల బెడద తప్పించిన కొండముచ్చు గురించి. అవును.. కోతులు పెట్టే నరకయాతన నుంచి తమను రక్షించిన కొండముచ్చు చనిపోవడంతో ఆ ఊరు ప్రజలంతా కన్నీరుమున్నీరయ్యారు. అంతేకాదు.. ఆ కొండముచ్చుకు సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి కన్నీటి వీడ్కోలు పలికారు.
పూర్తి వివరాల్లోకెళితే.. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ఎక్లాస్పూర్ గ్రామపరిధిలోని రంగన్నపల్లి గ్రామం ఉంది. ఈ గ్రామంలో కోతుల బెడద చాలా ఎక్కువగా ఉండేది. అయితే, ఎక్కడి నుంచి వచ్చిందో ఓ కొండముచ్చు వచ్చింది. ఆ కోతుల బెడద నుంచి గ్రామస్తులను రక్షించింది. దానికి కృతజ్ఞతగా వారు దానికి ఆహార పదార్థాలు పెట్టేవారు. గ్రామస్తులు పెట్టే ఆహారం తింటూ ఆ కొండముచ్చు కాలం వెల్లదీసింది. అయితే, ఇటీవల అనారోగ్యానికి గురైన కొండముచ్చు.. రంగన్నపల్లి గ్రామ శివారులో మృతి చెందింది. అది గమనించిన గ్రామస్తులు అయ్యో పాపం అనుకున్నారు. తమను కోతుల బెదడ నుంచి కాపాడిన కొండముచ్చును తలుచుకుని వారు కన్నీరు కార్చారు. కాగా, గ్రామ ప్రజలు చనిపోయిన కొండముచ్చుకు హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. మనుషులకు నిర్వహించినట్లే సంప్రదాయ బద్దంగా దహన సంస్కారాలు నిర్వహించారు. ఆంజనేయ స్వామి స్వరూపంగా భావించి ఈ కొండముచ్చుకు ఇలా సంప్రదాయ బద్దంగా అంత్యక్రియలు నిర్వహించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఓమూగ జీవికి అంత్యక్రియలు నిర్వహించి గ్రామస్తులు… అందరికి ఆదర్శంగా నిలిచారు.
Also read: