శ్మశానం పక్కన అరటి పండ్లే…ఆ వ‌ల‌స కూలీల పంచ‌ భ‌క్ష‌ ప‌ర‌వ‌న్నాలు..

|

Apr 16, 2020 | 10:34 AM

లాక్‌డౌన్ కారణంగా వలస కూలీలు ఎదుర్కొంటోన్న బాధ‌లు అన్నీ, ఇన్నీ కావు. కొంద‌రైతే ప్ర‌స్తుతం ఉన్న ప్రాంతాల్లో ఉండ‌లేక సొంత ఊర్ల‌కు వంద‌ల‌, వేల‌ కిలోమీట‌ర్లు నడిచివెళ్తున్నారు. మ‌రికొంద‌రు పిల్ల‌ల‌తో అంత‌దూరం ప్ర‌యాణించ‌లేక ఇప్పుడు ఉన్న ప్రాంతాల‌లోనే బిక్కుబిక్కుమంటూ గ‌డుపుతున్నారు. వారికి వ‌స‌తి, ఆహారం అందించ‌డానికి ప్రభుత్వాలు ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ.. కొందరికి మాత్రం అవి చేరువవ్వ‌డం లేవు. ఇటీవలే ఆగ్రాలో పాల ట్యాంకర్ బోల్తా పడగా..రోడ్డుపై ప‌డిన పాల‌ను ఓ వ్య‌క్తి దోసిళ్లతో ఎత్తి గిన్నెలో […]

శ్మశానం పక్కన అరటి పండ్లే...ఆ వ‌ల‌స కూలీల పంచ‌ భ‌క్ష‌ ప‌ర‌వ‌న్నాలు..
Follow us on

లాక్‌డౌన్ కారణంగా వలస కూలీలు ఎదుర్కొంటోన్న బాధ‌లు అన్నీ, ఇన్నీ కావు. కొంద‌రైతే ప్ర‌స్తుతం ఉన్న ప్రాంతాల్లో ఉండ‌లేక సొంత ఊర్ల‌కు వంద‌ల‌, వేల‌ కిలోమీట‌ర్లు నడిచివెళ్తున్నారు. మ‌రికొంద‌రు పిల్ల‌ల‌తో అంత‌దూరం ప్ర‌యాణించ‌లేక ఇప్పుడు ఉన్న ప్రాంతాల‌లోనే బిక్కుబిక్కుమంటూ గ‌డుపుతున్నారు. వారికి వ‌స‌తి, ఆహారం అందించ‌డానికి ప్రభుత్వాలు ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ.. కొందరికి మాత్రం అవి చేరువవ్వ‌డం లేవు. ఇటీవలే ఆగ్రాలో పాల ట్యాంకర్ బోల్తా పడగా..రోడ్డుపై ప‌డిన పాల‌ను ఓ వ్య‌క్తి దోసిళ్లతో ఎత్తి గిన్నెలో పోస్తుండగా.. అతడికి కొద్ది దూరంలోనే కుక్కలు పాలు గతుకుతున్న వీడియో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా పేదలు, వ‌ల‌స కూలీల‌ ఆకలి బాధ‌లు అద్దం పట్టే మరో ఘటన వెలుగు చూసింది.

ఢిల్లీలోని యమునా నది ప‌క్క‌న ఉన్న‌ నిఘమ్‌బోధ్ ఘాట్ శ్మశానం ప‌క్క‌న‌ పాడైపోయిన అరటి పండ్లను వ్యాపారులు పడేయగా.. వలస కార్మికులు కొంద‌రు వాటిలో నుంచి కాస్త బాగున్న వాటిని ఏరుకుంటూ కనిపించారు. అరటి పండ్లు అంత త్వరగా కుళ్లిపోవు.. ఇవి కొంత మేర మా కడుపు నింపుతాయని వాటిని తన సంచిలో మూట‌క‌ట్టుకుంటూ ఓ వ్యక్తి చెప్పాడు. మాకు రోజూ రెండు పూట‌ల ఆహారం దొర‌క‌దు కాబట్టి వీటిని తీసుకోవడమే ఉత్తమం అని యూపీ నుంచి వలస వచ్చిన వ్యక్తి ఒకరు ఆవేద‌న‌తో మాట్లాడారు.

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా స‌డ‌న్ గా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ఢిల్లీలో వేలాది మంది వలస కార్మికులు ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారిపోయింది. వీరిలో చాలా మంది ఉత్తర ఢిల్లీలోని యమునా నది ఒడ్డున బ్ర‌తుకు వెళ్ల‌దీస్తున్నారు. ఈ మ‌హ‌మ్మారి వైర‌స్ దేశాన్ని ఎప్పుడు వీడివెళ్తుందో, ఈ వ‌ల‌స జీవులు క‌ష్టాలు ఎప్పుడు తీర‌తాయో..!