తక్కువ ఖర్చుతో 20 నిమిషాల్లో కరోనా ఫలితం..!

| Edited By: Pardhasaradhi Peri

Jun 19, 2020 | 3:22 PM

ఐఐటీ హైదరాబాద్‌ పరిశోధక బృందం ప్రత్యేక టెస్టింగ్ కిట్ ను రూపొందించింది. అతి తక్కువగా రూ.600కే కరోనా నిర్ధారణ పరీక్ష కిట్‌ను అభివృద్ధి చేసింది. దీంతో 20 నిమిషాల్లోనే ఫలితాన్ని తెలుసుకోవచ్చట.

తక్కువ ఖర్చుతో 20 నిమిషాల్లో కరోనా ఫలితం..!
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నగరాలకే పరిమితమైన వైరస్ మెల్లమెల్లగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తోంది. ప్రతి ఒక్కరు కొవిడ్ 19 టెస్టులు తప్పనిసరిగా మారింది. టెస్టింగ్ పరికరాల ఖర్చు ఎక్కువగా ఉండడంతో పరీక్షల ఖర్చు సామాన్యుడికి భారంగా మారుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఐఐటీ హైదరాబాద్‌ పరిశోధక బృందం ప్రత్యేక టెస్టింగ్ కిట్ ను రూపొందించింది. అతి తక్కువగా రూ.600కే కరోనా నిర్ధారణ పరీక్ష కిట్‌ను అభివృద్ధి చేసింది. దీంతో 20 నిమిషాల్లోనే ఫలితాన్ని తెలుసుకోవచ్చట. ఈ కిట్‌ అభివృద్ధి చేసిన ఇద్దరు సభ్యుల బృందంలో కడప జిల్లా గాలివీడు మండల విద్యార్థిని పట్టా సుప్రజ ఒకరు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో వీటిని ఉత్పత్తి చేస్తే రూ.350లకే ఈ కిట్‌ను అందించవచ్చని ఆమె తెలిపారు. క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తయిన ఈ కిట్‌కు భారత వైద్య పరిశోధన మండలి (ICMR) నుంచి అనుమతి లభించగా.. పేటెంట్‌ కోసం దరఖాస్తు చేస్తున్నట్లు సుప్రజ వెల్లడించారు.
ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ శివ్‌గోవింద్‌సింగ్‌ పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థులు సూర్యస్నాత త్రిపాఠి, పట్టా సుప్రజ ఈ కిట్‌ రూపొందించారు. ప్రస్తుతం కరోనా నిర్ధారణ కోసం RTPCR (రివర్స్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ పాలీమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌) పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల ఫలితాల కోసం ఎక్కువ సమయం తీసుకోవడంతో పాటు, ఖర్చు కూడా అధికంగా ఉంటోంది. అయితే తాము రూపొందించిన కిట్‌ ద్వారా వ్యయప్రయాసలు తగ్గతాయని సుప్రజ తెలిపారు. ఈ కిట్ అన్ని ప్రాంతాలకు ఈజీగా తీసుకెళ్లిందుకు కూడా వీలవుతుందన్నారు. ఇప్పటి వరకు దేశంలో కరోనా వైరస్‌ నిర్ధారణ కిట్‌ను ఢిల్లీ ఐఐటీ తయారు చేయగా.. రెండో స్థానంలో హైదరాబాద్‌ ఐఐటీ నిలిచిందని సుప్రజ తెలిపారు.