ఫోక్స్ వ్యాగన్ కేసులో సాక్షిగా ఉన్న ఏపీ మంత్రి బొత్సా సత్యనారాయణకు షాక్ తగిలింది. ఆయనకు హైదరాబాద్ సీబీఐ కోర్టు సమన్లు జారీ చేస్తూ… సెప్టెంబర్ 12న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.
కేసు పూర్వాఫలాలోకి వెళ్తే.. 2005లో నమోదైన ఈ కేసులో… అప్పటి భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న బొత్సపై చాలా ఆరోపణలు వచ్చాయి. ఫోక్స్ వ్యాగన్ కంపెనీని హైదరాబాద్ నుంచీ వైజాగ్‌కి తరలించాలనే అంశంపై బొత్స, మరికొందరికి పెద్ద ఎత్తున ముడుపులు అందాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకి ఆదేశించింది. విచారణ జరుగుతున్న సమయంలో ఏడుగురిని నిందితులుగా చేర్చారు. 59మంది సాక్షులుగా ఉన్నారు. ఇప్పటికే 3వేల పేజీల ఛార్జిషీట్‌ను సీబీఐ దాఖలు చేసింది. దాదాపు రూ.7 కోట్ల వరకూ రికవరీ అవ్వగా… ఇంకా రూ.5కోట్ల 65లక్షలు రికవరీ కావాల్సి ఉంది. మరి ప్రస్తుతం బొత్స కోర్టుకు హాజరయ్యి ఏం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది.