Andhra: భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే శఠగోపం పెట్టేశారుగా
అందరూ గుడికి ఎందుకు వెళ్తారా.? దేవుడి మొక్కులు తీర్చుకునేందుకు అని అంటారు. కరెక్టే.! కానీ ఇక్కడ ఉన్న భార్యభర్తల ఇన్ టెన్షన్ కాస్త డిఫెరెంట్. వీళ్లు గుడికి వెళ్ళేది మాత్రం ఇందుకే. మరి ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

బంగారం ధర భారీగా పెరగడంతో ఇప్పుడు అందరి దృష్టి దాని మీదే పడింది. పెరిగిన బంగారం ధరలు అనేక అనర్థాలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో క్రైమ్ రేట్ పెరుగుతోంది. దొంగతనాలు, చైన్ స్నాచింగ్ లాంటివి ఎక్కువ అవుతున్నాయి. బంగారం కోసం హత్యలు చేయటానికి కూడా వెనకాడటం లేదు దోపిడి దొంగలు. చివరకు దేవుడు అన్న భక్తి, పాప భీతి లాంటివి కూడా ఉండటం లేదు. ఆలయాలలో సైతం దొంగతనాలకు పాల్పడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. సాధారణ భక్తుల్లాగే ఆలయానికి వచ్చి అమ్మవారి ఆభరణాలు దోచుకున్నారు ఓ జంట.
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ కొండాపురంలోని శ్రీ గాయత్రి మాత ఆలయంలో మంగళవారం ఉదయం పట్టపగలు దొంగలు పడ్డారు. ఉదయం సుమారు 08:30 నుంచి 08:45 గంటల మధ్యలో ఒక మగ వ్యక్తి, ఒక ఆడ వ్యక్తి సాధారణ భక్తులు దర్శనానికి వచ్చినట్టు గాయత్రి గుడికి వచ్చారు. ఆ సమయంలో ఆలయ అర్చకుడు పక్కనే టిఫిన్ చేస్తున్నారు. పంతులు టిఫిన్ చేసి వచ్చి చూసేసరికి ఆలయంలోని అమ్మవారి విగ్రహంపైన ఉన్న బంగారు ఆభరణాలు లేవు. ఆ సమయంలో వాళ్ళు ఇద్దరు తప్ప ఇంకెవరు రాలేదు. తరువాత పంతులు బయటకు వచ్చి వాకబు చెయ్యగా.. వాళ్ళు పాలకొండ NSN కాలనికి చెందిన పసల చిన్నారావు, అతని భార్య దుర్గ అని తెలిసింది. వెంటనే అర్చకుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. పోలీసులు సదరు వ్యక్తుల కోసం గాలింపు చేపట్టారు.
దొంగతనం చేసిన 24 గంటల్లోనే..
గాయత్రి గుడిలో దొంగతనానికి పాల్పడిన నిందితులను పట్టుకునే పనిలో ఉన్న పోలీసులు బుధవారం ఉదయం వీరఘట్టం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా చిన్నారావు, అతని భార్య మోటార్ సైకిల్ మీద పోలీసులకు తారసపడ్డారు. అనుమానం వచ్చి వారిని తనిఖీ చేయగా.. దొంగలించిన సొత్తు బయటపడింది. వారిని విచారించగా చోరీ సొత్తును అమ్మడానికి తీసుకు వెళుతున్నట్టు నిందితులు తెలిపారు. వెంటనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 18 గ్రాముల బంగారు శతమానాలు, 2.5 గ్రాముల రెండు బంగారు అడుగులు, బంగారు కళ్లు, 2.5 గ్రాముల ముక్కెర మొత్తం సుమారు 24 గ్రాముల ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 80 వేలు ఉంటుందని అంచనా.
