‘ హౌదీమోదీ ‘ ఈవెంట్.. తెర వెనుక వ్యూహమేంటి ? మోదీ.. ట్రంప్ రాజకీయ వ్యూహంలో ‘ పాచికేనా ‘?

' హౌదీమోదీ ' ఈవెంట్.. తెర వెనుక వ్యూహమేంటి ? మోదీ.. ట్రంప్ రాజకీయ వ్యూహంలో  ' పాచికేనా '?

అమెరికాలోని టెక్సాస్ లో ఈ నెల 22 న ‘ హౌదీమోదీ ‘ పేరిట మెగా ఈవెంట్ జరగనుంది. దాదాపు 50 వేల మంది ఇండియన్ అమెరికన్లతో బాటు అమెరికాలో పేరొందిన డెమొక్రాట్, రిపబ్లికన్ ఎంపీలు కూడా హాజరు కానున్న ఈ మెగా ఈవెంట్ కి మోదీ-ట్రంప్ ఇద్దరూ ఒకే వేదికను అలంకరించబోతున్నారు. మోదీ గౌరవార్థం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి డోనాల్డ్ ట్రంప్ తప్పనిసరిగా హాజరవుతారని వైట్ హౌస్ వెంటనే ప్రకటించింది. ఇది భారత, అమెరికా దేశాలమధ్య […]

Anil kumar poka

|

Sep 21, 2019 | 1:41 PM

అమెరికాలోని టెక్సాస్ లో ఈ నెల 22 న ‘ హౌదీమోదీ ‘ పేరిట మెగా ఈవెంట్ జరగనుంది. దాదాపు 50 వేల మంది ఇండియన్ అమెరికన్లతో బాటు అమెరికాలో పేరొందిన డెమొక్రాట్, రిపబ్లికన్ ఎంపీలు కూడా హాజరు కానున్న ఈ మెగా ఈవెంట్ కి మోదీ-ట్రంప్ ఇద్దరూ ఒకే వేదికను అలంకరించబోతున్నారు. మోదీ గౌరవార్థం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి డోనాల్డ్ ట్రంప్ తప్పనిసరిగా హాజరవుతారని వైట్ హౌస్ వెంటనే ప్రకటించింది. ఇది భారత, అమెరికా దేశాలమధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకే కాక, ఉభయ దేశాల మధ్య మైత్రీ సంబంధాలను మరింత పటిష్టపరచడానికి కూడా దోహదపడుతుందని భావిస్తున్నారు. టారిఫ్ ల విషయంలో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు కాస్త దెబ్బ తిన్న తరుణంలో ఈ ఈవెంట్ నిర్వహించడం వల్ల ఆ ‘ దెబ్బ ‘ కాస్తా సమసిపోతుందన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం. ఇక్కడ ఈ సమయంలో ఈ కార్యక్రమం నిర్వహించడంలోని గూడార్థాన్ని వారు అంచనా వేస్తున్నారు. అమెరికాలో వచ్ఛే ఏడాది నవంబరులో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో ముఖ్యంగా ఇండియన్ అమెరికన్లు.. ట్రంప్ రాజకీయ భవితవ్యానికి ఓటు బ్యాంకుగా మారనున్నారు.

అంటే వీరిలో ఆయనకు అనుకూలురైనవారే ఎక్కువగా ఉన్నారు. ఈ మెగా ఈవెంట్ కు వారంతా హాజరు అవుతున్నారంటే.. అది తనకు పొలిటికల్ మైలేజీ అని ట్రంప్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్ఛే ఏడు జరిగే ఎన్నికల్లో వీరి ఓట్లవల్ల తనకు ఢోకా ఉండదని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో డెమొక్రాట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఈ రాష్ట్రంలో నివసిస్తున్న ఇండియన్ అమెరికన్లలో చాలామంది డెమొక్రాట్ అభ్యర్థుల వైపే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో డెమొక్రాట్ల డామినేషన్ కి చెక్ పెట్టి, ఇండియన్ అమెరికన్లను తన రిపబ్లికన్ పార్టీవైపు తిప్పుకోవాలంటే .ఇప్పటినుంచే తగిన పాచిక వేయడం ట్రంప్ సారుకు తప్పనిసరి. అందుకు ఇలాంటి ఈవెంట్లు చాలా ఉపయోగపడుతాయి. పైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యే ఇండియన్ అమెరికన్లలో చాలామంది బీజేపీ అనుకూలురుగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. వీరంతా ఇండియాలో భారత ప్రధాని మోడీ నాయకత్వం పట్ల ఆకర్షితులైనవారే. మోదీ ఎప్పుడు అమెరికాలో పర్యటించినా సంబంధిత కార్యక్రమాలకు వీరంతా హాజరవుతున్నారు.

ఇక ఈ ఏడాది ఇండియాలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అనేకమంది ఎన్నారైలు బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు.. చాలామంది మోదీ పాలనకు కితాబిఛ్చారు. ఇప్పుడు తమ దేశానికి ఆయన వస్తున్నారు గనుక అత్యుత్సాహంగా వారంతా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తహతహలాడుతున్నారు. భారత దేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానానికి ఎన్నారైలు తమ పూర్తి మద్దతును ప్రకటించారు. బహుశా ఇందుకు కృతజ్ఞతా పూర్వకంగానా అన్నట్టు మోడీ సైతం తన పేరిట జరిగే కార్యక్రమానికి గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఈవెంట్ ను టెక్సాస్ లోని హూస్టన్ లో నిర్వహిస్తున్నట్టు తెలియగానే మూడు వారాలముందే ఆన్ లైన్ లో అన్ని ‘ టికెట్లూ ‘ అమ్ముడు పోయాయట. పైగా ఇందులో భారతీయతను ప్రతిబించే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా హైలైట్ గా నిలవనున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం పది గంటలకు మొదలై మధ్యాహ్నం ఒంటిగంట వరకు సాగే ఈ ఈవెంట్ ను నభూతో నభవిష్యతి అన్న రీతిలో నిర్వహించనున్నారు.

మోదీ-ట్రంప్ రాజకీయంగా లబ్దిని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో తెరవనుకనుంచి ఈ కార్యక్రమాన్ని ‘ తీర్చిదిద్దారా ‘ అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా ఇలాంటివి రెండు దేశాల మైత్రికి మరింత దోహదపడుతాయని భావిస్తున్నారు. అమెరికా సెనేట్ లో దక్షిణాసియా వ్యవహారాలపై గల పొలిటికల్ కమిటీ చైర్మన్ అయిన స్టెనీ వంటి ప్రముఖ డెమొక్రాట్ ఎంపీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ను ఏకాకి చేయడానికి మోదీ తన ఈ పర్యటనను వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు ముఖ్యంగా అమెరికా వెంటనే తన మద్దతును ప్రకటించవచ్ఛు. ఐరాస సమావేశాల్లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ప్రసంగిస్తారని, జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టేందుకు యత్నిస్తారని, అయితే ఆయనకు అంతర్జాతీయ దేశాల సపోర్ట్.. ముఖ్యంగా చైనా నుంచి తప్ప ఇతర దేశాల నుంచి మద్దతు లభించదని తెలుస్తోంది. మొత్తానికి సుమారు వారం రోజుల తన అమెరికా పర్యటనలో మోదీ…. ఇండియాలో తన నాయకత్వానికి తిరుగు లేదని నిరూపించుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నించనున్నారన్నది సుస్పష్టం.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu