ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో శనివారం సాయంత్రం సుదీర్ఘంగా భేటీ అయ్యారు. సాయంత్రం 4:30 గంటలకు మోదీని కలిసిన జగన్.. సుమారు గంటన్నర పాటు ఆయనతో చర్చలు జరిపారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలను ప్రధాన మంత్రికి వివరించి.. రాష్ట్రాన్ని కేంద్రమే ఆదుకోవాలని అభ్యర్థించారు. ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై వీరిద్దరు చర్చించినట్లు సమాచారం.
ఈ నెల 15నుంచి శ్రీకారం రైతు భరోసా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దానికి మోదీ సానుకూలంగా స్పందించారని సమాచారం. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేకంగా నిధులను విడుదల చేయాలని కోరినట్లు తెలుస్తోంది. అదే విధంగా పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా నిధుల ఆదా వివరాలను ప్రధానికి సీఎం జగన్ వివరించినట్లు తెలిసింది. అంతేకాకుండా ఏపీకి సంబంధించిన సమస్యలు, కేంద్రంతో ముడిపడి ఉన్న అంశాలను ప్రధానితో భేటీలో సీఎం చర్చించినట్లు సమాచారం.
తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సంయుక్తంగా ప్రణాళికలు రచిస్తున్న కృష్ణా- గోదావరి జలాల అనుసంధానం కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు నిధులపై కూడా వీరు చర్చించారు. కాగా రైతుభరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా ఈ నెల 15న ఒక్కో రైతు కుటుంబానికి 12,500 రూపాయలు ఇవ్వాలని సీఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించాలని భావించిన ముఖ్యమంత్రి జగన్.. ఆయనను సగౌరవంగా ఆహ్వానం అందించారని, దానికి మోదీ సానుకూలంగా స్పందించారని ఏపీ సీఎంవో వర్గాలు చెబుతున్నాయి.