ఆ ప్రైవేట్ ఆస్పత్రుల్లో తక్కువ ధరకే చికిత్స

కరోనా ప్రభావంతో కుంటి నడక నడుస్తున్న హోటల్ యాజమాన్యం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది ఇంతకాలం పర్యాటకులకు అతిథ్యం కల్పించిన హోటళ్లు ఇప్పుడు కరోనా రోగులకు సేవలందిస్తున్నాయి. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు అనుబంధ క్వారంటైన్ సెంటర్లుగా మారిపోయాయి.

ఆ ప్రైవేట్ ఆస్పత్రుల్లో తక్కువ ధరకే చికిత్స

Updated on: Jul 29, 2020 | 2:41 AM

కరోనా ప్రభావంతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. రవాణ సౌకర్యాలు నిలిచిపోవడంతో వచ్చిపోయేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా హోటళ్ల బిజినెస్ పూర్తిగా స్తంభించిపోయింది. ఉద్యోగులు ఉపాథి కోల్పోయి రోడ్డునపడుతున్నారు. దీంతో కుంటి నడక నడుస్తున్న హోటల్ యాజమాన్యం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది ఇంతకాలం పర్యాటకులకు అతిథ్యం కల్పించిన హోటళ్లు ఇప్పుడు కరోనా రోగులకు సేవలందిస్తున్నాయి. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు అనుబంధ క్వారంటైన్ సెంటర్లుగా మారిపోయాయి. ఆస్పత్రుల్లో సకాలంలో పడకలు దొరకని బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ సపర్యలు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ మహానగరంలో దాదాపు 2వేలకు పైగా పడకలు ఉన్న హోటళ్లు కొవిడ్ రోగులతో నిండిపోయాయి.

రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో దాదాపు వెయ్యికి పైగా చిన్నా, పెద్దా హోటళ్లు నడుస్తున్నాయి. లాక్ డౌన్ కారణంగా వ్యాపారమంతా తలకిందులైపోయింది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులతో కలిసి కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కుదేలైన వ్యాపారాన్ని గాడిలో పెట్టేందుకు ఫ్లాన్ చేసి మంచి లాభాలను పొందుతున్నారు. త్రీస్టార్‌, అంతకంటే తక్కువ స్థాయి హోటళ్లు కొన్నింటిని సెమీ కొవిడ్‌ క్వారంటైన్ సెంటర్లుగా మార్చేశారు. ఆస్పత్రుల్లో ఎక్కువ ఫీజులు చెల్లించలేనివారు హోటళ్లలో తక్కువ ధరకు వైద్యం అందుతుండడంతో కరోనా బాధితులు సైతం ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే నగరంలో పది ఆస్పత్రులకు దాదాపు 20 హోటళ్లు ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుని సేవలందిస్తున్నారు. ఇలాంటి హోటళ్లలో దాదాపు వెయ్యి మంది చికిత్స పొందుతున్నారు. ప్రధానంగా బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, సికింద్రాబాద్‌, బేగంపేట్ తదితర ప్రాంతాల్లోని హోటళ్లు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. హోటళ్లలో చికిత్సపొందేందుకు కరోనా రోగులు సైతం ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఇటు వైద్యం ఖర్చులు తగ్గడంతో పాటు హోటళ్లకు ఆదాయాన్ని కూడా తెచ్చిపెడుతున్నాయి.

హోటళ్లలోని క్వారంటైన్ ఉండాలనుకునే వారికి కొన్ని ప్రత్యేక నిబంధనలు సూచిస్తున్నారు. కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తులు ముందుగా ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుల సూచన మేరకు మాత్రమే హోటళ్లలో చికిత్స అందిస్తున్నారు.
పాజిటివ్‌ వచ్చిన రోగులు సంబంధిత ఆస్పత్రులకు వెళ్లి వైద్యులను సంప్రదించాలి. రోగి పరిస్థితి విషమంగా ఉంటే ఆస్పత్రిలో చేర్చుకుంటారు. తక్కువ లక్షణాలు ఉన్నవారిని హోటల్‌ గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. హోటల్ ఖర్చులు భరించలేనివారిని వారివారి ఇళ్లలోనే ఉంచి ఫోన్‌ ద్వారా వైద్య సాయం అందిస్తున్నారు.

హోటళ్లలో చేరిన కొవిడ్ బాధితులకు అన్ని సదుపాయాలను కల్పిస్తున్నారు. సింగిల్, డబుల్ రూంలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అంతేకాదు 24 గంటలపాటు వైద్యులు, నర్సులు అందుబాటులో ఉంటున్నారు. బాధితుడికి సమస్య తీవ్రమైతే వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఒక్కొక్క పేషెంట్ నుంచి రోజుకు రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు వసూలు చేస్తున్నారు. భోజనం ఇతరత్రా సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. మందులు, పీపీఈ కిట్లను సమకూర్చి వాటికి అదనంగా వసూలు చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా సేవలందించేందుకు సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని హోటల్స్ నిర్వహకులు చెబుతున్నారు.

ఇంట్లోనే ఉండి చికిత్స పొందాలనుకునే వారి కోసం కూడా ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చారు. 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండేవారికి మందులు, కిట్‌లతో కలుపుకుని మొత్తంగా రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్రతిరోజూ వైద్యుడు సంబంధిత రోగికి ఫోన్‌ ద్వారా వైద్యులు సలహాలు, సూచనలు అందిస్తుంటారు. ప్రస్తుతం ఈ విధానంలో సుమారు 2 వేల మంది వారివారి ఇళ్లలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

ఇప్పటికే ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌కు కేటాయించిన పడకలన్నీ రోగులతో నిండిపోయాయి. స్పల్ప లక్షణాలున్న వారు ఆస్పత్రిలో చేరడానికి ఒత్తిడి తెస్తున్నారు. దీంతో హోటల్ గదులను అద్దెకు తీసుకుని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యం చికిత్స అందిస్తున్నారు. ఇలా హోటళ్లలో చికిత్స పొంది ఎందరో కోలుకొని ఇళ్లకు వెళ్తున్నారు. హోం క్వారంటైన్‌లో ఉంటూ మా సూచనలతో చికిత్స పొందే వారి సంఖ్య సైతం పెరిగింది. ఇటు, హోటల్ రంగంలోని వారికి ఉపాథి అవకాశాలతో పాటు ఆదాయాన్ని కూడా తెచ్చిపెడుతున్నాయి.