పెద్ద కుమార్తెను కూడా తనకే అప్పగించాలంటూ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావు కోడలు సింధు శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కొన్ని షరతులతో పెద్దమ్మాయి రిషితను సింధుకే ఇవ్వాలని హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో వారంలో రెండు రోజుల పాటు తండ్రి వద్ద బిడ్డను ఉంచాలని కోర్టు తెలిపింది. శుక్రవారం సాయంత్రం తండ్రి తీసుకెళ్లి సోమవారం ఉదయం అప్పగించాలని కోర్టు వెల్లడించింది. ఈ ప్రక్రియను తదుపరి విచారణ జరిగే జూన్ 4 వరకు కొనసాగించాలని పేర్కొంది.
కాగా తన ఇద్దరు కుమార్తెలను అప్పగించాలంటూ జస్టిస్ రామ్మోహన్‌రావు కోడలు సింధు శర్మ కొద్దిరోజులుగా ఆందోళన చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏడాదిన్నర వయసున్న చిన్న కుమార్తెను ఆమెకు అప్పగించగా.. పెద్ద కుమార్తెను కూడా తనకు ఇవ్వాలంటూ సింధు పోరాటం చేస్తోంది. ఈ మేరకు హైకోర్టులో బుధవారం ఆమె హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.