IMD issues red alert: తెలంగాణపై మళ్లీ వరుణుడు విరుచుకు పడబోతున్నాడు. రాబోయే మూడ్రోజుల్లో కుండపోత ఖాయమంటూ వాతావరణశాఖ ఇవాళ హెచ్చరించింది. ఐఎండీ వార్నింగ్‌తో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కాగా, మూడు వారాల క్రితం జోరువానలతో హడలెత్తించిన వరుణుడు… స్మాల్ బ్రేక్ తీసుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, మరోసారి వర్షాలు దంచి కొడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. రాబోయే మూడ్రోజుల్లో తెలంగాణ అంతటా మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కుండపోత వానలు కురిసే అవకాశముందని వార్నింగ్ ఇచ్చింది. పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉన్నందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మహానగరం హైదరాబాద్ లోనూ తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. పశ్చిమ, నైరుతి గాలుల ప్రభావంతో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయన్న వాతావరణశాఖ… ఈ గాలుల కారణంగానే వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అలాగే, రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున మరోసారి విస్తారంగా వర్షాలు కురవడం ఖాయమంటున్నారు. మరోవైపు, ఈనెల 13న అల్పపీడనం ఏర్పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు.
మొత్తం మీద వారం పది రోజులపాటు తెలంగాణ అంతటా జోరువానలు తప్పవని అధికారులు చెబుతున్నారు. ఇక, ఇప్పటికే, కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకోగా, ప్రధాన జలాశయాలు నిండుకుండల్లా మారాయి. వాగులు-వంకలు సైతం పొంగి పొర్లుతున్నాయి. ఇప్పుడు మరోసారి, వర్షాలు ముంచెత్తనున్నాయనే హెచ్చరికలతో ఇటు ప్రభుత్వం, అటు అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యాయి. మొన్నటి వర్షాలకు పట్టణాలకు పట్టణాలే జల దిగ్బంధంలో చిక్కుకుపోవడంతో … అలాంటి పరిస్థితి మరోసారి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.