AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CATలో 99% వచ్చినా ఆర్మీనే ఎంచుకున్నాడు.. కట్‌చేస్తే కన్నీరు పెట్టిస్తున్న కల్నల్ అనురాగ్ బతుకు పోరు!

CATలో 99 పర్సంటైల్‌ సాధించినప్పటికీ కార్పొరేట్‌ కెరీర్‌ను వదిలి భారత సైన్యంలో చేరిన కల్నల్‌ అనురాగ్‌ ఉపాధ్యాయ్‌ పారా స్పెషల్‌ ఫోర్సెస్‌లో సేవలందించారు. 2025 ఆగస్టులో తీవ్ర స్ట్రోక్‌కు గురైన ఆయన ప్రస్తుతం తీవ్రమైన న్యూరోలాజికల్‌ సమస్యలతో పోరాడుతున్నారు. కళ్ల కదలికలు, అక్షరాలను స్కాన్‌ చేయడం ద్వారా మాత్రమే కమ్యూనికేట్‌ చేయగల పరిస్థితిలో ఉన్న ఆయనకు వైద్యులు, న్యూరో-రిహాబిలిటేషన్‌ నిపుణులు, అసిస్టివ్‌ టెక్నాలజీ, బ్రెయిన్‌-కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌ నిపుణుల సహాయం అందించాలని కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది..

CATలో 99% వచ్చినా ఆర్మీనే ఎంచుకున్నాడు.. కట్‌చేస్తే కన్నీరు పెట్టిస్తున్న కల్నల్ అనురాగ్ బతుకు పోరు!
Colonel Anurag Upadhyay Story
Srilakshmi C
|

Updated on: Sep 15, 2026 | 9:44 AM

Share

భారత సైన్యంలో మాజీ అధికారి, స్పెషల్‌ ఫోర్సెస్‌ వెటరన్‌ కల్నల్‌ అనురాగ్‌ ఉపాధ్యాయ్‌ ఉదంతం నెట్టింట మరోమారు వైరల్‌గా మారింది. ఆయన కోలుకోవడానికి, మరింత స్వతంత్రంగా జీవించేందుకు కొత్త మార్గాలను అన్వేషించేందుకు వైద్యులు, రిహాబిలిటేషన్‌ నిపుణులు, టెక్నాలజీ నిపుణుల సహాయం అవసరమని కుటుంబం బహిరంగంగా వెల్లడించింది. ప్రముఖ వ్యాపారవేత్త శ్రద్ధా శర్మ షేర్‌ చేసిన ఈ విజ్ఞప్తి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే అనురాగ్‌ ఉపాధ్యాయ్‌ కథ ప్రస్తుత వైద్య పరిస్థితికి ముందే ఎంతో భిన్నంగా ఉండేది. CAT పరీక్షలో ఆయన ఏకంగా 99వ పర్సంటైల్‌ సాధించారు. దీంతో కార్పొరేట్‌ రంగంలో మంచి కెరీర్‌ను ఎంచుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఆయన సైన్యంలో సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. అనంతరం స్పెషల్‌ ఫోర్సెస్‌లో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.

ఎవరీ కల్నల్‌ అనురాగ్‌ ఉపాధ్యాయ్‌?

కల్నల్‌ అనురాగ్‌ ఉపాధ్యాయ్‌ భారత సైన్యంలోని ప్రతిష్ఠాత్మక పారా స్పెషల్‌ ఫోర్సెస్‌లో పనిచేసిన మాజీ అధికారి. CATలో అద్భుతమైన ఫలితం సాధించినప్పటికీ కార్పొరేట్‌ ఉద్యోగం వైపు వెళ్లకుండా దేశ సేవను ఎంచుకున్నారు. ఆయన 3 PARA (SF)లో ప్రొబేషన్‌ పూర్తి చేసి, అనంతరం 12 PARA (SF) ఏర్పాటులో భాగమైన రైజింగ్‌ టీమ్‌లో చేరారు. 2008లో గుండెపోటుకు గురైనప్పటికీ సేవను కొనసాగించి, తిరిగి యాక్టివ్‌ డ్యూటీలోకి వచ్చార్‌. ఇది ఆయన సైనిక జీవితం పట్టుదల, అంకితభావానికి ప్రతీకగా నిలిచింది.

2025లో తీవ్ర అనారోగ్యం

అనురాగ్‌ ఉపాధ్యాయ్‌ జీవితంలో 2025 ఆగస్టులో తీవ్రమైన ఆరోగ్య సమస్య ఎదురైంది. ఆయనకు పోస్టీరియర్‌ సర్క్యులేషన్‌ స్ట్రోక్‌ వచ్చింది. దీని కారణంగా మెదడులో తీవ్రమైన నాడీ సంబంధిత నష్టం సంభవించి, ఆయన లాక్డ్‌-ఇన్‌ సిండ్రోమ్‌కు గురయ్యారు. లాక్డ్‌-ఇన్‌ సిండ్రోమ్‌లో వ్యక్తి స్పృహతో, చుట్టూ జరుగుతున్న విషయాలను అర్థం చేసుకుంటున్నప్పటికీ శరీరాన్ని కదిలించడం, మాట్లాడటం సాధ్యం కాదు. అనురాగ్‌ ఉపాధ్యాయ్‌ మాత్రం కళ్ల కదలికల ద్వారా, అక్షరాలను గుర్తించే స్కానింగ్‌ విధానాన్ని ఉపయోగించి తన ఆలోచనలను పూర్తిగా వ్యక్తం చేయగలుగుతున్నారు. అనారోగ్యానికి సంబంధించిన సమస్యల కారణంగా అనంతరం ఆయనకు రెండు కాళ్లను మోకాళ్ల కింది భాగం వరకు తొలగించే శస్త్రచికిత్సలు జరిగాయి. దీంతో ఆయన జీవనం మరింత క్లిష్టంగా మారింది.

ఇవి కూడా చదవండి

అనురాగ్‌ ఉపాధ్యాయ్‌ కుటుంబం ప్రస్తుతం ప్రత్యేక వైద్య, సాంకేతిక సహాయం కోసం ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా లాక్డ్‌-ఇన్‌ సిండ్రోమ్‌ వంటి నాడీ సంబంధిత పరిస్థితులపై అనుభవం ఉన్న న్యూరాలజిస్టులు, న్యూరో-రిహాబిలిటేషన్‌ నిపుణులు, రిహాబిలిటేషన్‌ కేంద్రాలు, పరిశోధకులతో పరిచయాలు కల్పించాలని కోరుతోంది. అలాగే ఆధునిక అసిస్టివ్‌ టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న నిపుణుల సహాయాన్ని కూడా కోరుతున్నారు. ముఖ్యంగా బ్రెయిన్‌-కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌లు (BCI), ఐ-ట్రాకింగ్‌, ప్రత్యామ్నాయ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌ వంటి సాంకేతికతలపై పనిచేస్తున్న బృందాలతో అనుసంధానం కావాలని అనురాగ్‌ కుటుంబం భావిస్తోంది. మాజీ సైనికులు, సంస్థలు, వైద్యులు, పరిశోధకులు, సంబంధిత సంస్థలతో పరిచయాలు ఉన్న వ్యక్తులు ముందుకు వచ్చి సహాయం చేయాలని అనురాగ్‌ కుటుంబం విజ్ఞప్తి చేస్తుంది.

Follow Us