AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ishan Kishan: జర్ర బ్రేక్ ఇవ్వండి సామీ.. రెండు రోజులు మంచం దిగనంటున్న ఇషాన్ కిషన్

Ishan Kishan: దులీప్ ట్రోఫీ నుంచి టీ20 మ్యాచ్‌ల వరకు తీరికలేకుండా ఆడిన ఇషాన్ కిషన్ తీవ్ర అలసట కారణంగా వచ్చే రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటానని, మంచం దిగనని సరదాగా తెలిపారు. రెడ్ బాల్ క్రికెట్ నుంచి సడన్‌గా వైట్ బాల్, టీ20 ఫార్మాట్‌కు మారడం సవాల్‌తో కూడుకున్న విషయమని ఇషాన్ తెలిపారు.

Ishan Kishan: జర్ర బ్రేక్ ఇవ్వండి సామీ.. రెండు రోజులు మంచం దిగనంటున్న ఇషాన్ కిషన్
Ishan Kishan
Rakesh
|

Updated on: Sep 15, 2026 | 9:29 AM

Share

Ishan Kishan: టీమిండియా యంగ్ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గత కొన్ని రోజులుగా విశ్రాంతి లేకుండా వరుస మ్యాచ్‌లు ఆడుతూ బిజీగా గడుపుతున్నారు. చెన్నైలో జరిగిన దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌తో పాటు రెస్ట్ లేకుండా నేరుగా టీ20 సిరీస్‌కు రెడీ కావడంతో ఆయన తీవ్ర అలసటకు గురయ్యారు. దీనివల్ల వచ్చే రెండు రోజులు తాను మంచం మీద నుంచే కదలనని, కేవలం నిద్రపోతూ రికవరీపైనే దృష్టి పెడతానని ఇషాన్ సరదాగా, తీవ్ర అలసటతో చెప్పుకొచ్చారు.

దులీప్ ట్రోఫీ నుంచి టీ20ల వరకు ప్రయాణం

సెప్టెంబర్ 10 వరకు చెన్నైలో దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఆడిన ఇషాన్ కిషన్.. ఆ టోర్నీలో ఏకంగా 270 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడి అదరగొట్టారు. ఆ వెంటనే సెప్టెంబర్ 11న ఢిల్లీకి చేరుకుని వైట్ బాల్ క్రికెట్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ప్రాక్టీస్ సెషన్‌లో కొద్దిగా నడుము నొప్పి బారిన పడినప్పటికీ సెప్టెంబర్ 13న ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన తొలి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో బరిలోకి దిగారు. ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి చక్కటి భాగస్వామ్యం నెలకొల్పి కేవలం 33 బంతుల్లోనే 42 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా మైదానంలోనూ చురుగ్గా కదులుతూ ప్రత్యర్థి ఆటగాడిని రన్ అవుట్ చేశారు.

ఫార్మాట్ల మార్పు అంత సులభం కాదు

రెడ్ బాల్ క్రికెట్ నుంచి సడన్‌గా వైట్ బాల్, టీ20 ఫార్మాట్‌కు మారడం సవాల్‌తో కూడుకున్న విషయమని ఇషాన్ తెలిపారు. ఒక ప్రొఫెషనల్ క్రికెటర్‌గా పరిస్థితులకు త్వరగా అలవాటు పడాలి. రకరకాల ఫార్మాట్లలో ఆడుతూ మళ్లీ టీ20 జోన్‌లోకి రావడం ఒక్కోసారి సమయం పడుతుంది. అభిషేక్ శర్మ అవతలి ఎండ్ నుంచి ఎదురుదాడి చేస్తుంటే, నేను ఇక్కడ ఒక వన్డే ఇన్నింగ్స్ మాదిరిగా ఆడానని ఇషాన్ పేర్కొన్నారు. మైదానంలో మానసికంగా, శారీరకంగా ఎంతో ప్రశాంతంగా ఉంటూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే తన లక్ష్యమని వెల్లడించారు.

రెండు రోజులు విశ్రాంతే లక్ష్యం

తీరిక లేని ప్రయాణాలు, ప్రాక్టీస్, మ్యాచ్‌లు తన శరీరాన్ని అలసిపోయేలా చేశాయని ఇషాన్ కిషన్ తెలిపారు. తదుపరి మ్యాచ్‌కు ముందు శరీరం కోలుకోవడం ఎంతో ముఖ్యమని చెప్పారు. “నేను ఇక ఏపని చేయను, కేవలం విశ్రాంతి తీసుకుంటాను. రాబోయే మ్యాచ్‌కు ముందు ఒక మంచి వర్కవుట్ సెషన్ చేసి మైదానంలోకి దిగుతాను. కానీ ప్రస్తుతానికైతే రెండు రోజులు మంచం దిగి ఎక్కడికీ వెళ్లను కంప్లీట్ గా నిద్రపోతాను” అంటూ తన అలసటను సరదాగా షేర్ చేసుకున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us