పేదలకు ఉచితంగా ప్లాస్మా.. కరోనా రోగులకు ‘మెగా’సాయం

|

Sep 29, 2020 | 3:50 PM

కరోనా రోగులను ఆదుకునేందకు మెగా స్టార్ మరోసారి సంకల్పించారు. పేదలెవరైనా కరోనా వైరస్ బారిన పడి క్లిష్టంగా మారితే.. వారికి ఉచితంగా కోవిడ్ ప్లాస్మాను ఇవ్వాలని మెగాస్టార్ స్థాపించిన చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు నిర్ణయించింది.

పేదలకు ఉచితంగా ప్లాస్మా.. కరోనా రోగులకు ‘మెగా’సాయం
Follow us on

Free Covid-19 plasma for poor corona patients: పచ్చటి జీవితాలపై కర్కశ కరోనా పంజా విసురుతూ జనజీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది కరోనా వైరస్. అందులో పేద రోగులు చికిత్స పొందడం గగనమవుతోంది. ఈ పరిస్థితుల్లో పేద రోగుల్ని కరోనా బారి నుంచి కాపాడేందుకు చిరంజీవి ఐ అండ్‌ బ్లడ్‌ బ్యాంక్‌ సమాయత్తమైంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పట్నించి ఏదో ఒక రకంగా ప్రజలను ఎడ్యుకేట్ చేేసేందుకు యత్నిస్తున్న చిరంజీవి.. కరోనా వైరస్ వ్యాప్తి వేగవంతమై.. పేదలు మృత్యువాత పడుతున్న తరుణంలో తనదైన ఆఫర్‌తో ముందుకు రావడం విశేషం.

కరోనా సోకి రోగ విముక్తులైనవారు ఫ్లాస్మాదానం చేస్తే మరికొంతమందికి ఆయుష్షు పోసినట్లే. ఈ నేపధ్యంలో పేదలైన కరోనా సోకిన రోగులకు ఉచితంగా ఫ్లాస్మా వితరణ చేసేందుకు చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ నిర్ణయం తీసుకుంది. తెల్ల రేషన్‌ కార్డు దారులు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్‌ పేషెంట్లకు చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ఉచితంగా ఫ్లాస్మా సరఫరా చేయాలని సంకల్పించింది. ఈ అవకాశాన్ని పేదలంతా సద్వినియోగపరుచుకోవాల్సిందిగా బ్లడ్ బ్యాంక్ సీఈఓ మంగళవారం తెలిపారు.

22 సంవత్సరాలుగా మెగాస్టార్‌ చిరంజీవి సొంత నిధులు వెచ్చించి 9 లక్షల 27 వేల మంది పేద రోగులకు చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా ఉచితంగా రక్తనిధులు అందించారన్న విషయాన్ని ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంకు సీఈఓ వివరించారు. తన బ్లడ్ అండ్ ఐ బ్యాంకు ద్వారా ఎన్నో జీవితాల్లో వెలుగు నింపిన చిరంజీవి.. తాజాగా కరోనా పాండమిక్ పరిస్థితిలోను తనదైన శైలిలో ఉదారత్వాన్ని చాటుకుంటున్నారని ఆయన కొనియాడారు.