తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి పోడులో పెళ్లి ఇంట ఊహించని ఘటన చోటుచేసుకుంది. పక్కనే పొలం ఉన్న రైతు డొంకకు మంట పెట్టడంతో.. నిప్పులు చెలరేగి అవి ఎగిరివచ్చి తాటాకు ఇళ్లపై పడ్డాయి. దీంతో రెండు తాటాకు ఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి. కొద్దిరోజుల్లోనే కూతురు పెళ్లి ఉండడంతో తెచ్చి ఇంట్లో పెట్టిన బంగారం, లక్షా ఎనభై వేలు నగదు, పెండ్లి బట్టలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఫైరింజన్లు వచ్చి మంటలు ఆర్పే సమయానికి అక్కడ బుగ్గే మిగిలింది. రెండు కుటుంబాలకు చెందిన బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
చిత్తూరు జిల్లా రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి పాల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసి పడటంతో ఏం జరిగిందే అర్థం కాక స్థానికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. విద్యుత్ షార్ట్ సర్కూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ.. భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read: ఏపీ-తెలంగాణ జల వివాదంపై సీఎం జగన్ సంచలన కామెంట్స్.. వారికి ఇబ్బంది కలుగకూడదనే..