జైలు జీవితం ఎలా ఉంటుందో చూడాలని ఉందా..? నేరం చేయకుండానే వెళ్లొచ్చు..!
హైదరాబాద్‌లోని చంచల్ గూడ సెంట్రల్ జైలు వేదికగా తెలంగాణ కారాగార శాఖ ఒక వినూత్న అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. సమాజంలో నేరాల పట్ల అవగాహన కల్పించడానికి, జైలు జీవితంలోని కఠినతలను ప్రజలకు పరిచయం చేయడానికి “ఫీల్ ది జైల్” కార్యక్రమాన్ని, అత్యాధునిక తెలంగాణ జైలు మ్యూజియంను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఘనంగా ప్రారంభించారు.

హైదరాబాద్‌లోని చంచల్ గూడ సెంట్రల్ జైలు వేదికగా తెలంగాణ కారాగార శాఖ ఒక వినూత్న అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. సమాజంలో నేరాల పట్ల అవగాహన కల్పించడానికి, జైలు జీవితంలోని కఠినతలను ప్రజలకు పరిచయం చేయడానికి “ఫీల్ ది జైల్” (Feel The Jail) కార్యక్రమాన్ని, అత్యాధునిక తెలంగాణ జైలు మ్యూజియంను మంగళవారం (మే 12, 2026)న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఘనంగా ప్రారంభించారు. ఒకప్పుడు శిక్షా కేంద్రాలుగా మాత్రమే ఉన్న జైళ్లు, నేడు సంస్కరణా నిలయాలుగా ఎలా మారాయో ఈ మ్యూజియం కళ్లకు కడుతుందని గవర్నర్ ఈ సందర్భంగా కొనియాడారు.
తెలంగాణ జైలు మ్యూజియం ప్రత్యేకతలుః
గతంలో సంగారెడ్డిలో ఉన్న జైలు మ్యూజియం భవనం శిథిలావస్థకు చేరడంతో, దానిని ఆధునిక హంగులతో చంచల్ గూడకు తరలించారు.
చారిత్రక సాక్ష్యాలు: పురాతన కాలం నాటి జైలు రికార్డులు, ఖైదీలకు వేసే సంకెళ్లు, గొలుసులు, ఉరిశిక్షకు సంబంధించిన అరుదైన వస్తువులను ప్రదర్శనకు ఉంచారు.
జీవన విధానం: ఖైదీల బ్యారక్‌ల నమూనాలు, పెయింటింగ్ గ్యాలరీలు, ఆడియో-విజువల్ ప్రజెంటేషన్ల ద్వారా జైలు చరిత్రను వివరించారు.
చారిత్రక సేవలు: 1961-68 మధ్య నాగార్జునసాగర్ ఆనకట్ట నిర్మాణంలో ఖైదీలు చేసిన సేవలను ప్రత్యేక విభాగంలో ప్రదర్శించడం విశేషం.
సాధారణ ప్రజలు కూడా జైలు జీవితం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. నిర్ణీత రుసుము చెల్లించి 12 గంటలు లేదా 24 గంటల పాటు జైలులో గడపవచ్చు. ఇందులో ఖైదీల వస్త్రధారణ, జైలు భోజనం, కఠినమైన క్రమశిక్షణ, రోజువారీ కార్యకలాపాలు ఖైదీల మాదిరిగానే ఉంటాయి. ఇది కేవలం వినోదం కోసం కాదు; జైలు జీవితంలోని ఇబ్బందులను చూడటం ద్వారా యువత నేరాల వైపు వెళ్లకుండా ఉండాలని, చట్టాల పట్ల గౌరవం పెరగాలని అధికారులు భావిస్తున్నారు.
సందర్శకుల సౌకర్యార్థం జైలు ఆవరణలో కేఫెటీరియాను ఏర్పాటు చేశారు. ఈ అనుభవాన్ని పొందాలనుకునే వారు www.telanganajailexperience.com, https://www.telanganajailexperience.com వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 94946 32046 నంబర్‌ను సంప్రదించవచ్చు.
శిక్ష కంటే సంస్కరణే ప్రధానమని చాటిచెప్పేలా చంచల్ గూడ జైలు చేపట్టిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది. జైలు వ్యవస్థపై ఉన్న భయం కంటే, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎలా మలచుకోవాలో వివరించడమే ఈ మ్యూజియం యొక్క అంతిమ ఉద్దేశం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
