Stock Market: అందరి చూపు ఆర్బీఐ వైపే.. ఈ వారం మార్కెట్ల తీరును నిర్ణయించే అంశాలు ఇవే..
Stock Market: వచ్చే వారం స్టాక్ మార్కెట్ల దిశను ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన సమీక్షా ఫలితాలు నిర్ణయించనున్నాయి. దీనికి తోడు మార్కెట్లను ఏఏ కారణాలు ప్రభావితం చేయనున్నాయంటే..
Stock Market: వచ్చే వారం స్టాక్ మార్కెట్ల దిశను ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన సమీక్షా ఫలితాలు నిర్ణయించనున్నాయి. ఇది కాకుండా.. మార్కెట్ పార్టిసిపెంట్లు గ్లోబల్ ట్రెండ్, విదేశీ నిధుల ట్రెండ్, ముడి చమురు ధరలు కూడా ప్రభావం చూపనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మధ్య కాలంలో మార్కెట్‌లో మెరుగుదల కనిపించినా.. అది ఊహించినంత బలంగా కనిపించడం లేదని వారు అంటున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య ప్రపంచ స్థాయిలో విధానపరమైన నిర్ణయాలను కఠినతరం చేయడం కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. గత వారం BSE సెన్సెక్స్ సూచీ 884.57 పాయింట్లు లేదా 1.61 శాతం లాభపడింది.
రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య సమీక్షా సమావేశ ఫలితాలు జూన్ 8న వెల్లడికానుండటం, జూన్ 10న వ్యాపారం ముగిసిన తర్వాత పారిశ్రామిక ఉత్పత్తి రానున్న తరుణంలో అందరూ వాటి కోసం ఎదురుచూస్తున్నారు. గ్లోబల్ ఫ్రంట్‌లో, యూఎస్ నిరుద్యోగ డేటా, వినియోగదారుల ధరల సూచిక డేటా శుక్రవారం రానున్నాయి. ప్రపంచ మార్కెట్ల దృక్కోణంలో ఇవి చాలా ముఖ్యమైనవి. ఇవి మార్కెట్ సెంటిమెంట్‌పై ఎక్కువగా ప్రభావం చూపనున్నాయి. వీటికి తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఇప్పటికీ తమ డబ్బును ఉపసంహరించుకుంటూనే ఉన్నారు. అయితే ఇప్పుడు దాని వేగం కాస్త తగ్గింది.
ఈ సారి సమావేశాన్ని రిజర్వు బ్యాంక్ జూన్ 6-8 వరకు జరపనుంది. పాలసీ రేట్లను మరోసారి పెంచేందుకు మార్కెట్ ఇప్పటికే సిద్ధమైంది. రుతుపవనాల అనుకూల అంచనాల మధ్య అందరి దృష్టి రిజర్వ్ బ్యాంక్ వ్యాఖ్యలపైనే ఉంటుంది. అంతే కాకుండా గ్లోబల్ మార్కెట్ల పనితీరు, ముడిచమురు ధరలపైనే అందరి దృష్టి ఉంటుందని తెలుస్తోంది. ఇదే సమయంలో చైనా, అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా వెలువడనున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ వారం స్టాక్ మార్కెట్లను ప్రధానంగా రిజర్వు బ్యాంక్ ద్రవ్యపరపతి సమావేశంలో తీసుకునే నిర్ణయాలపైనే అధారపడి ఉండనుందని తెలుస్తోంది.