వాడీవేడీగా మొదలైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సంధర్భంలో వైసీపీ ఎమ్మెల్యే కాకాని చంద్రబాబు పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసలు చంద్రబాబు విదేశీ పర్యటనలతో రాష్ట్రానికి జరిగిన లాభమేంటని ఆయన ప్రశ్నించారు. బాబు విదేశీ పర్యటనలపై దర్యాప్తు జరిపించాలని సభాపతి తమ్మినేని సీతారాంను కోరారు. దీనిపై స్పందించిన బాబు తాను నీతి, నిజాయితీగా బతికానని.. తనను విమర్శించే ముందు మీ గురించి మీరు ఆలోచించుకోండి అంటూ వైసీపీ ఎమ్మెల్యేలను విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనం కోసం తాను నిరంతరం కష్టపడ్డానని చెప్పారు. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రెండు సార్లు అవార్డులు వచ్చాయని బాబు గుర్తు చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఐదు లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చామని చంద్రబాబు తెలిపారు. అయితే దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కృషి వల్లే కియా మోటార్స్ వచ్చిందని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చంద్రబాబు వాదనలను తిప్పికొట్టారు.