AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీలోని అక్షర్‌ధామ్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

న్యూఢిల్లీలోని స్వామినారాయణ అక్షర్‌ధామ్ మందిరంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించి, దేశ సమగ్రత, ఐక్యత, శాంతి, ప్రగతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యువత దేశ ఐక్యత, సాంస్కృతిక విలువలను కాపాడేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఢిల్లీలోని అక్షర్‌ధామ్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Akshardham Independence Day
Ram Naramaneni
|

Updated on: Aug 15, 2026 | 12:52 PM

Share

దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ.. న్యూఢిల్లీలోని స్వామినారాయణ అక్షర్‌ధామ్ మందిరంలోనూ స్వాతంత్ర్య వేడుకలను భక్తిశ్రద్ధలు, దేశభక్తి, జాతీయ సమైక్యత స్ఫూర్తితో నిర్వహించారు. మందిర ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి.. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించారు. దేశ సమగ్రత, ఐక్యత, శాంతి, ప్రగతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా బీఏపీఎస్ సంస్థకు చెందిన సీనియర్ సాధువు, బీఏపీఎస్ సారంగ్‌పూర్ మందిర్ ముఖ్య స్వామి పూజ్య జ్ఞానేశ్వర్ స్వామి మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరంపై బ్రహ్మస్వరూప్ యోగీజీ మహారాజ్‌కు ఉన్న భక్తిని గుర్తుచేశారు. దండి మార్చ్ సమయంలో మహాత్మా గాంధీ దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం సాధించాలన్న తన సంకల్పాన్ని శాస్త్రిజీ మహారాజ్‌కు తెలియజేశారని చెప్పారు. శాస్త్రిజీ మహారాజ్ సూచన మేరకు యోగీజీ మహారాజ్ భారతదేశ స్వాతంత్ర్యం కోసం 18 ఏళ్ల పాటు ప్రతిరోజూ 25 మాలలు జపిస్తూ నిరంతరం ప్రార్థనలు చేశారని తెలిపారు.

దేశ స్వాతంత్ర్యం, సంక్షేమం కోసం ఆధ్యాత్మిక సాధన, దేశభక్తి ఎంతటి శక్తివంతమైన మార్గాలుగా నిలుస్తాయో ఈ ఘటన చాటిచెబుతుందని జ్ఞానేశ్వర్ స్వామి పేర్కొన్నారు. దేశానికి అసలైన బలం ఐక్యతలోనే ఉందని అన్నారు. స్వాతంత్ర్య అమృతకాలంలో ప్రతి పౌరుడు వ్యక్తిగత ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ తన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.

ముఖ్యంగా యువత దేశ ఐక్యత, సమగ్రతతో పాటు భారతీయ సాంస్కృతిక విలువలను పరిరక్షించేందుకు కృషి చేయాలని సూచించారు. యువతలో దేశభక్తి, సేవాభావం, బాధ్యతాయుతమైన పౌరస్ఫూర్తిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ సందర్భంగా బీఏపీఎస్ సంస్థ ఆధ్యాత్మిక అధిపతి పరమ పూజ్య మహంత్ స్వామి మహారాజ్ అందరికీ ఆశీస్సులు అందించారు. ఐక్యత, సామరస్యం, దేశసేవ స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. భారత్ నిరంతరం అభివృద్ధి చెందాలని, దేశంలో శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని, ప్రపంచంలోని ప్రజలందరికీ మేలు కలగాలని ప్రార్థించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన ధైర్యవంతులైన అమరవీరుల త్యాగాలను ఎల్లప్పుడూ స్మరించుకోవాలని సందేశమిచ్చారు.

వేడుకల్లో పాల్గొన్న సాధువులు, భక్తులు దేశం పట్ల అంకితభావం, ఐక్యత, సేవా స్ఫూర్తితో పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. దీంతో అక్షర్‌ధామ్ మందిర ప్రాంగణం దేశభక్తి, ఆధ్యాత్మికత, జాతీయ సంక్షేమ స్ఫూర్తితో నిండిపోయింది.

Mahant Swami Maharaj

Param Pujya Mahant Swami Maharaj

Follow Us