AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంజనం వేసి ఆచూకీ తెలుసుకుంటారన్న సమాచారంతో అలెర్టైన దొంగ.. ఏం చేశాడంటే..?

నరసరావుపేటలో భారీ చోరీ కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఇంట్లో రూ.20 లక్షల నగదు, 317 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ కాగా.. కొద్ది రోజుల తర్వాత ఇంటి బయట రూ.19 లక్షల నగదుతో ఓ బ్యాగ్, లేఖ ప్రత్యక్షమయ్యాయి. తన వాటాగా వచ్చిన డబ్బును తిరిగి ఇస్తున్నానని, బంగారం గురించి మాత్రం అడగొద్దని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

అంజనం వేసి ఆచూకీ తెలుసుకుంటారన్న సమాచారంతో అలెర్టైన దొంగ.. ఏం చేశాడంటే..?
Anjanam
T Nagaraju
| Edited By: |

Updated on: Aug 15, 2026 | 12:39 PM

Share

నరసరావుపేటలో జరిగిన ఓ భారీ చోరీ ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఇంట్లో రూ.20 లక్షల నగదు, 317 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ కాగా.. కొద్ది రోజుల తర్వాత అదే ఇంటి బయట రూ.19 లక్షల నగదుతో ఓ బ్యాగ్ ప్రత్యక్షమైంది. అంతేకాదు.. దొంగ రాసినట్లుగా భావిస్తున్న లేఖ కూడా అందులో ఉండటం పోలీసులకు సైతం కొత్త సవాలుగా మారింది.

నరసరావుపేట పట్టణంలోని ప్రకాశ్‌నగర్ బాలాజీ ఆర్కేడ్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న ఆదినారాయణ రెడ్డి, కోటేశ్వరమ్మ దంపతులు గత నెల 30న బంధువు మృతి చెందడంతో రొంపిచర్ల మండలం కొత్తపల్లి గ్రామానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండటంతోపాటు ఇంట్లో భారీ చోరీ జరిగినట్లు గుర్తించారు. 317 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.20 లక్షల నగదు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు రంగంలోకి దిగి సాంకేతిక ఆధారాల కోసం విస్తృతంగా గాలించారు. అయితే చోరీకి పాల్పడిన వారి కదలికలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. అపార్ట్‌మెంట్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించినా అనుమానాస్పద కదలికలు కనిపించలేదు. దీంతో పోలీసులకు మరో అనుమానం వచ్చింది. అపార్ట్‌మెంట్‌లో ప్రతిరోజూ తెల్లవారుజామున సుమారు అరగంట పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని గుర్తించారు. ఆ సమయంలోనే చోరీ జరిగి ఉండొచ్చని భావించి దర్యాప్తును ఆ కోణంలోనూ కొనసాగిస్తున్నారు.

అయితే అసలు ట్విస్ట్ ఆ తర్వాత చోటుచేసుకుంది. ఆదినారాయణ రెడ్డి ఇంటి బయట ఉన్న చెప్పుల స్టాండ్‌లో ఓ బ్యాగ్ కనిపించింది. దానితోపాటు ఓ లేఖ కూడా ఉండటంతో అనుమానం వచ్చిన దంపతులు బ్యాగ్ తెరిచి చూడగా.. అందులో ఏకంగా రూ.19 లక్షల నగదు ఉంది. వెంటనే విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. లేఖలో.. తన వాటాగా వచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేస్తున్నానని, అయితే బంగారు ఆభరణాల గురించి మాత్రం తనను అడగొద్దని రాసినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. తనపై చేతబడి చేయించవద్దంటూ వేడుకున్నట్లు సమాచారం. ఈ లేఖను ఇంటి యజమాని పోలీసులకు అప్పగించడంతో దర్యాప్తు మరింత ఆసక్తికరంగా మారింది.

లేఖలోని చేతిరాత, ఇతర ఆధారాలను పరిశీలించేందుకు పోలీసులు దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. లేఖ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? అతడికి ఇంటి విషయాలు ఎలా తెలుసు? దొంగతనంలో అతడి పాత్ర ఎంత? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. భారీ మొత్తంలో చోరీ జరగడంతో దంపతులు అంజనం వేయించగా, అపార్ట్‌మెంట్‌లోని వారే చోరీకి పాల్పడినట్లు చెప్పారనే ప్రచారం స్థానికంగా జరుగుతోంది. ఈ విషయం దొంగల చెవిన పడటంతో.. తమపై చేతబడి చేయిస్తారనే భయంతోనే రూ.19 లక్షలు తిరిగి ఇచ్చి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఈ చోరీ వెనుక పూర్తిగా తెలిసిన వ్యక్తులే ఉండొచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. బంగారు ఆభరణాలను ఇప్పటికే విక్రయించి, వాటి ద్వారా వచ్చిన మొత్తంలో కొంత భాగాన్ని నగదు రూపంలో తిరిగి ఇచ్చి ఉంటారన్న ప్రచారం కూడా స్థానికంగా వినిపిస్తోంది. అయితే వీటిలో ఏది వాస్తవం, ఏది ఊహాగానమో తేలాల్సి ఉంది.

ప్రస్తుతం పోలీసులు ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. లేఖలోని చేతిరాత, ఇతర ఆధారాలతో నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. రూ.19 లక్షలను ఎవరు తిరిగి పెట్టారు? బంగారు ఆభరణాలు ఎక్కడ ఉన్నాయి? దొంగలకు బాధిత కుటుంబంతో ఉన్న సంబంధం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరికితే ఈ మిస్టరీ చోరీ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

ఇప్పటికే ఈ ఘటన నరసరావుపేట పట్టణంలో తీవ్ర చర్చకు దారితీసింది. దొంగతనం జరిగిన ఇంటి ముందే రూ.19 లక్షలు, ఓ లేఖ వదిలి వెళ్లడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Follow Us