ఈశాన్య ఢిల్లీలోని భజన్‌పురాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒక ఇంటిలో అయిదు మృతదేహాలు స్థానికులను షాక్‌కి గురి చేశాయి. ఒక జంట, వారి ముగ్గురు పిల్లలు చనిపోయినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా.. హత్య-ఆత్మహత్యకు సంబంధించిన కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మరణాలు నాలుగు లేదా ఐదు రోజుల క్రితం జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఐదు మృతదేహాలు కుళ్ళిపోవడం ప్రారంభమై తీవ్రమైన దుర్గంధం రావడంతో.. అనుమానం వచ్చిన ఇరుగు పొరుగువారు బుధవారం ఉదయం 11.30 గంటల సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చారు. లోపల గడియ పెట్టి ఉండటంతో తలుపులు బద్దలుకొట్టి పోలీసులు ఇంట్లోకి ప్రవేశించారు. ఇంటి యజమాని శంభు ఇ-రిక్షా డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. శంభు వయసు 43 ఏళ్లు కాగా.. అతని భార్య సునీతాకు 38 సంవత్సరాలు. వీరికి 16 ఏళ్ల కుమార్తెతో పాటు ఇద్దరు కుమారులు (14), (12) ఉన్నారు. మృతాదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.