AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medak: ఇంట్లో చోటు లేక.. మృతదేహం నేరుగా స్మశానానికే

మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం దర్పల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొన్నేళ్లుగా సొంత ఇల్లు లేక చిన్న డేరాలో జీవిస్తున్న లక్ష్మీ (65) అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు సరైన స్థలం లేకపోవడంతో.. ఆస్పత్రి నుంచి నేరుగా స్మశానవాటికకు తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు.

Medak: ఇంట్లో చోటు లేక.. మృతదేహం నేరుగా స్మశానానికే
Homeless Family
P Shivteja
| Edited By: |

Updated on: Sep 21, 2026 | 12:47 PM

Share

బతికున్నప్పుడే సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబానికి.. తల్లి మరణించిన తర్వాత కూడా కష్టాలు తప్పలేదు. కనీసం చివరి చూపు చూసేందుకు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో.. ఆస్పత్రి నుంచి నేరుగా స్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. ఈ విషాద ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం దర్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. దర్పల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ (65) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమెను మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ పరిస్థితి మరింత విషమించడంతో లక్ష్మీ మృతి చెందారు. సాధారణంగా ఎవరైనా మృతి చెందితే.. మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి బంధువులు, గ్రామస్తులు చివరి చూపు చూసిన అనంతరం అంత్యక్రియలకు తరలిస్తారు. అయితే లక్ష్మీ కుటుంబానికి ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ఆ కుటుంబం కొన్నేళ్లుగా సొంత ఇల్లు లేక చిన్న డేరా వేసుకుని జీవిస్తోంది. వారు నివసిస్తున్న ప్రదేశంలో మృతదేహాన్ని ఉంచేందుకు సరైన స్థలం లేకపోవడంతో.. ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని నేరుగా గ్రామంలోని స్మశానవాటికకు తరలించారు. అక్కడే బంధువులు, కుటుంబ సభ్యులు లక్ష్మీకి తుది నివాళులు అర్పించి అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిని కోల్పోయిన బాధ ఒకవైపు.. కనీసం ఆమె మృతదేహాన్ని కూడా ఇంటికి తీసుకెళ్లలేకపోయామన్న ఆవేదన మరోవైపు కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది.

సొంత గూడు లేకపోవడం ఒక కుటుంబాన్ని ఎలాంటి దుస్థితికి గురిచేస్తుందో ఈ ఘటన మరోసారి కళ్లకు కట్టినట్లు చూపించింది. పేద కుటుంబాలకు ఇల్లు అనేది కేవలం నివాసానికి మాత్రమే పరిమితం కాదని.. జీవితంలోని చివరి ఘడియల్లోనూ ఆత్మీయులకు గౌరవంగా వీడ్కోలు పలికేందుకు అవసరమైన కనీస ఆశ్రయమని ఈ ఘటన చర్చకు తెచ్చింది. దర్పల్లి ఘటన నేపథ్యంలో సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న ఈ కుటుంబ పరిస్థితిపై అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. కుటుంబానికి ప్రభుత్వ గృహ పథకాల అర్హత ఉంటే.. నిబంధనల ప్రకారం సొంత ఇంటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక తల్లికి చివరి వీడ్కోలు పలికే సమయంలో కూడా.. ఇంట్లో చోటు లేని పరిస్థితి రావడం దర్పల్లి గ్రామంలో విషాదాన్ని నింపింది.

Follow Us