స్మార్ట్ ఫోన్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో, నష్టాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ ద్వారా లక్షలు సంపాదించే వారు కొంతమంది అయితే.. అదే స్మార్ట్ ఫోన్‌తో వేలల్లో, లక్షల్లో లాస్ అయిన వారు చాలామంది ఉన్నారు. మీ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్‌కి ఇటీవలి కాలంలో రకరకాల మెసేజ్‌లు వస్తున్నాయా.? ఇంటి వద్దనే ఉంటూ సింపుల్‌గా లక్షలు సంపాదించండి.. ఇందుకు మీరు ఈ లింక్‌లను క్లిక్ చేయండి చాలు.. ఇప్పుడు ఈ ప్రకటనలే కొంపలు మంచుతున్నాయి. అత్యాశకు పోయి వాటిని క్లిక్ చేశారో ఇక అంతే సంగతి. దీనికి తోడు యాప్‌లో పెట్టుబడి పెట్టండి. టాస్క్‌లు పూర్తి చేస్తే లక్షల్లో డబ్బు ఇస్తాం. కేవలం ఫొటోలకు, వీడియోలకు లైక్ కొట్టి వేలల్లో సంపాదించొచ్చు అంటూ ఇలా సైబర్ నేరగాళ్లు ఎంతోమందిని బురిడీ కొట్టిస్తున్నారు. లక్షల్లో డబ్బును కాజేస్తున్నారు. ఇలా సంగారెడ్డి జిల్లాలో గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు 323 సైబర్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు బాధితులు సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.22.71 కోట్ల వరకు మోసపోయారు. ఇందులో సకాలంలో బాధితులు ఫిర్యాదు చేయగా రూ.3.62 కోట్ల వరకు ఫ్రీజ్ చేశారు పోలీసులు.
గుమ్మడిదల మండలం అన్నారం గ్రామానికి చెందిన ఓ నిరుద్యోగి వాట్సాప్‌కి ఉద్యోగం ఉందంటూ ఓ మెసేజ్ వచ్చింది. ఆ ఉద్యోగంతో పాటు పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి విడతల వారీగా అతని వద్ద మొత్తం రూ.1.78 లక్షలు పెట్టుబడిగా పెట్టించి డబ్బులు మొత్తం దోచుకున్నారు సైబర్ నేరగాళ్లు. ఇలా కాకుండ కొత్తగా ఇప్పుడు నయా ట్రెండ్ స్టార్ట్ చేశారు కేటుగాళ్ళు. కేవలం ఫొటోలకు, వీడియోలకు లైక్ కొట్టడమే, మీ పని అంటూ మెసేజ్‌లను గుర్తు తెలియని ఫోన్ నంబర్ నుంచి వాట్సాప్‌లకు మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఈ కామర్స్‌ల పేరిట ఉన్న యాప్‌లలోని వస్తువులకు రేటింగ్ ఇవ్వడం, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమాహాళ్లకు రేటింగ్ ఇవ్వడం, వాట్సాప్‌లలో యూజర్లకు పంపే మెసేజ్‌లలో లింకు ఓపెన్ చేసి ఫాలో అవ్వాలని, యూట్యూబ్ వీడియోలకు లైకులు ఇవ్వాలని, ఎన్ని లైకులు చేస్తే అన్ని టాస్క్‌లు పూర్తి చేసినట్టని చెబుతున్నారు. వాటిని స్క్రీన్ షాట్ తీసి తిరిగి తమకు పంపాలంటారు. ఒక్కో టాస్క్‌కు రూ.50 నుంచి రూ.250 వరకు ఇస్తామని, అలా టాస్క్‌లు పూర్తి చేసిన తర్వాత డబ్బు పంపడానికి గుగూల్ పే, ఫోన్ పే లింకులు ఇవ్వాలని, లేదా బ్యాంకు అకౌంట్‌ను ఇవ్వాలని కోరుతారు. ,ముందుగా ఇచ్చిన టాస్క్ పూర్తిచేసిన తర్వాత మీ బ్యాంకు ఖాతాలలో డబ్బు జమ చేస్తామని బురిడీ గొట్టించి పేరు, వయస్సు, వృత్తి, ఫోన్‌నంబరు ఇతర పూర్తి వివరాలు అన్ని మెల్లగా సేకరిస్తారు. అమాయకులను నమ్మించడానికి గూగుల్ పే, ఫోన్‌పేల ద్వారా మొదటగా వందల రూపాయలు పంపుతారు. తర్వాత సదరు వ్యక్తి బ్యాంకులో ఉన్న మొత్తం డబ్బును సైబర్ నేరగాళ్లు కొట్టేస్తారు.
మరో వైపు యాప్, టాస్క్‌లు, ట్రేడింగ్ అంటూ పెట్టుబడి పెట్టించి సైబర్ కేటుగాళ్లు అందినకాడికి ఊడుస్తున్నారు. మొదట చిన్న మొత్తంలో పెట్టిన పెట్టుబడికి లాభం చూపిస్తారు. ఆశతో పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టిన సమయంలో ఆ డబ్బులను కాజేస్తారు. అమీన్‌పూర్ పరిధిలోని భవానీపురానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అదనపు ఆదాయం సంపాదించుకోవచ్చని ఇలానే ఓయాప్‌లో పెట్టుబడి పెట్టాడు. మొదట యాప్‌లో రూ.2 వేలు పెట్టుబడి పెట్టగా లాభాలు చూపించారు. ఆ తర్వాత మొత్తం రూ.15.37లక్షలు యాప్‌లో జమ చేశాడు. తన లాభం, అసలు డబ్బు చెల్లించాలని కోరగా యాప్ నుంచి స్పందన లేదు. అమీన్‌పూర్ పరిధిలోని హెచ్‌ఎంటీ స్వర్ణపురి కాలనీకి చెందిన స్టాక్ ట్రేడర్ ఆన్‌లైన్‌లో ట్రేడింగ్ చేస్తుండేవాడు. ఆయన కూడా ఇలాగే సైబర్ వలకు చిక్కాడు. ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్‌లో రూ.27.71 లక్షలు జమ చేశాడు. కొన్ని రోజుల తర్వాత సదరు యాప్ మార్ఫింగ్ లోగోతో ఉన్నట్టు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. ఇలా సైబర్ నేరగాళ్ల చేతిలో ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే అధికంగా మోసపోతున్నారు. ఇలా సైబర్ నేరగాళ్లు విసురుతున్న వలలో అనేక మంది ఉద్యోగులు, నిరుద్యోగులు చిక్కుకుంటున్నారు.
ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నా.. పార్ట్‌టైం జాబ్‌తో అదనంగా డబ్బు సంపాదించవచ్చన్న ఆశతో సైబర్ నేరగాళ్ల బారిన పడి లక్షల్లో నష్టపోతున్నారు. జిల్లాలోని అమీన్‌పూర్, పటాన్‌చెరు, రామచంద్రపురం తదితర పట్టణాల్లో మోసపోయిన బాధితులు చాలానే ఉన్నారు. ఇక మరో వైపు పోలీసులు కూడా సైబర్ మోసాలపై ఎప్పటికి అప్పుడు అవగాహన కల్పిస్తున్నా ఈ ఘటనలు మాత్రం ఆగడం లేదు. అధిక లాభాలంటే నమ్మొద్దు అని.. మొబైల్ ద్వారా వచ్చే అనుమానాస్పద మెసేజ్‌లకు స్పందించవద్దు అని పోలీసులు పలు మార్లు చెప్పినా కొంతమంది మాత్రం మారడం లేదు. అధిక లాభాలు ఇస్తామని ఆశ చూపిస్తే వాటిలో మోసం ఉన్నట్టు గ్రహించాలని.. ఫ్రీ గిఫ్ట్‌లు, లాటరీల పేరుతో వచ్చే ప్రకటనలను నమ్మొద్దు అని, ఓఎల్‌ఎక్స్ వంటి వెబ్‌సైట్‌లలో వస్తువులను అమ్మే సమయంలో ఎవరైనా వ్యక్తి క్యూఆర్ కోడ్ పంపి స్కాన్‌చేసి డబ్బు పొందండి అంటే అది మోసమేనని గుర్తించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఒకవేళ సైబర్ నేరగాళ్ల బారినపడి మోసపోతే వెంటనే 155260 లేదా 100కు ఫోన్ చేయాలని.. లేదా ఎన్‌సీఆర్‌పీ పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే డబ్బును ఫ్రీజ్ చేయడానికి సాధ్యమవుతుంది అని చెబుతున్నారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..