Covid-19: అక్కడ మాస్క్ లేకుండా కనిపిస్తే అంతే సంగతి…2 రోజుల్లో రూ.10లక్షల జరిమానా వసూలు
Covid-19 News Update: దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతోంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా పలు నగరాల్లో మాస్క్‌ను విధిగా ధరించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతోంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా పలు నగరాల్లో మాస్క్‌ను విధిగా ధరించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అటు నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతాల్లో మాస్క్ లేకుండా ఎవరైనా కనిపిస్తే జరిమానాతో వాయించేస్తున్నారు. గత రెండు రోజుల వ్యవధిలోనే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకుండా తిరుగుతున్న 9,370 మంది వ్యక్తుల నుంచి రూ.9,37,000 జరిమానా వసూలు చేశారు. గురువారంనాడు 3,364 మందికి రూ.3,36,400 జరిమానా విధించగా….శుక్రవారంనాడు 6,006 మందికి రూ.6,00,600 జరిమానా విధించినట్లు తెలిపారు.
అటు కార్లు, ఇతర సొంత వాహనాల్లో మాస్క్‌లు లేకుండా ప్రయాణిస్తున్న వారికి కూడా పోలీసులు జరిమానా విధిస్తున్నారు. రెండ్రోజుల వ్యవధిలో 2,947 వాహన యజమానులకు రూ.3.62 లక్షల జరిమానా విధించారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించని 147 మందిపై 60 ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదుచేశారు. బహిరంగ ప్రదేశాల్లో నిబంధనలకు విరుద్ధంగా గుమికూడే వారిపై కూడా కేసులు నమోదుచేస్తున్నారు. మూడో రోజు శనివారం కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌ను కొనసాగిస్తున్నారు.
కోవిడ్-19 నివారణకు జారీచేసిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే సహించేది లేదని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఇంటి నుంచి బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని పోలీస్ అడిషినల్ కమిషనర్ లవ్ కుమార్ స్పష్టంచేశారు. మాస్క్ ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరించే వారికి జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి బహిరంగ ప్రదేశాల్లో పోలీసులు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భౌతిక దూరం నిబంధన ఉల్లంఘించే వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
బహిరంగ ప్రదేశంలో ఓ వ్యక్తి మాస్క్ ధరించకపోవడంతో పాటు పాన్ నమిలి ఉమ్మివేస్తుండటాన్ని గుర్తించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్లు వెల్లడించారు. నలుగురు వ్యక్తులకు మించి ఒకే చోట గుమికూడితే వారిపై కేసులు నమోదుచేస్తున్నట్లు తెలిపారు. అత్యవసరమైతేనే తప్ప ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచిస్తున్నారు. అలాగే తరచూ హ్యాండ్ వాష్ చేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని సూచిస్తు్న్నారు.