కరోనావైరస్ వ్యాప్తికి ముందు ఈ జోన్స్ వ్యవహారం పెద్దగా ఎవరికీ తెలీదు. ఇప్పుడు అందరి నోర్లలో నానుతున్నప్పటీ వాటిపై కొందరికి పూర్తి అవగాహన లేదు. కంటైన్మెంట్ జోన్, బఫర్ జోన్, రెడ్ జోన్ లను ఏ విధంగా వర్గీకిస్తారు అనే విషయంలో ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కోవిడ్-19 కేసులను గుర్తించిన నిర్దిష్ట ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్‌గా పిలుస్తారని ‘ఆరోగ్య ఆంధ్ర’ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
కంటైన్మెంట్ జోన్ చుట్టూ ఉన్న ప్రాంతం, కొత్తగా కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలను బఫర్ జోన్‌గా పిలుస్తారని తెలిపింది. ఎక్కువ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు ఉండి.. వ్యాప్తి శాతం ఎక్కువగా పెరుగుతున్న ప్రాంతాలను రెడ్ జోన్ లేదా హాట్ స్పాట్ గా పిలుస్తారని ప్రభుత్వం పేర్కొంది. పాజిటివ్ కేసులు సంఖ్య తక్కువగా నమోదైన ప్రాంతాలను ఆరెంజ్ జోన్‌గా పరిగణిస్తారని తెలిపింది. కొద్ది కాలంగా పాజిటివ్ కేసులు నమోదు కాని, లేదా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా పిలుస్తారని తెలిపింది.
ఏప్రిల్ 15 ముందు వరకు 15 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్‌గా పరిగణించేవారు. తర్వాత దాని ప్రాతిపదిక స్థితిగతులను మార్చారు. రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల్లో 80 శాతం కేసులున్న జిల్లాను రెడ్ జోన్‌గా పిలుస్తారు. లేదంటే నాలుగు రోజుల్లో కోవిడ్-19 పాజిటివ్ కేసులు రెట్టింపయిన జిల్లాను రెడ్ జోన్‌గా పరిగణిస్తారు.
ఇక రెడ్ జోన్‌గా ఉన్న ఏరియాలో 14 రోజులపాటు కొత్త కేసులేవీ నమోదు కాకపోతే దాన్ని ఆరెంజ్ జోన్‌గా మారుస్తారు. ఆరెంజ్ జోన్ లో 14 రోజులపాటు కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాకపోతే దాన్ని గ్రీన్‌జోన్‌గా మారుస్తారు. అంటే రెడ్ జోన్… గ్రీన్ జోన్‌గా రూపాంతరం చెందాలంటే 28 రోజులపాటు కొత్త పాజిటివ్ కేసులేవీ నమోదు కాకూడదు.
ఇక ఒక నిర్దిష్ట ప్రాంతంలో నాలుగు కంటే ఎక్కువ కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైతే దాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా పిలుస్తారు. ఉదాహరణకు ఏదైనా బిల్డింగ్‌లో నాలుగు కోవిడ్ కేసులు నమోదైతే దాన్ని సీల్ చేస్తారు. దాని చుట్టూ అర కిలోమీటర్ మేర ఉన్న ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా అనౌన్స్ చేస్తారు. కంటైన్‌మెంట్ జోన్ చుట్టూ కిలోమీటర్ మేర ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్‌గా పిలుస్తారు. అంటే అక్కడ కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్నమాట. కంటైన్‌మెంట్ జోన్‌లో ప్రజల ఇళ్ల నుంచి బయటకు వెళ్లడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదు. నిత్యావసరాలు కూడా అధికారులే ఇళ్ల వద్దకు అందిస్తారు. బఫర్ జోన్లో ప్రజలకు పాక్షిక అనుమతులు ఉంటాయి.