AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రియుడికి బైక్‌ కొనివ్వాలని దొంగగా మారిన యువతి.. తండ్రి స్నేహితుడి ఇంట్లోనే చోరీ!

ప్రియుడికి కొత్త ద్విచక్ర వాహనం కొనివ్వాలనే ఉద్దేశంతో తండ్రి స్నేహితుడి ఇంట్లో 9 సవరన్ల బంగారు ఆభరణాలను చోరీ చేసిన 19 ఏళ్ల కాలేజీ విద్యార్థినిని తమిళనాడులోని పొల్లాచ్చి ఈస్ట్‌ పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో బంగారాన్ని విక్రయించి వచ్చిన డబ్బుతో ప్రియుడికి బైక్‌ కొనుగోలు చేసినట్లు ఆమె అంగీకరించింది. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న ఆమె ప్రియుడు పరారీలో ఉండటంతో పోలీసులు గాలిస్తున్నారు..

ప్రియుడికి బైక్‌ కొనివ్వాలని దొంగగా మారిన యువతి.. తండ్రి స్నేహితుడి ఇంట్లోనే చోరీ!
College Student Arrested In Gold Theft Case
Srilakshmi C
|

Updated on: Sep 06, 2026 | 8:15 AM

Share

కోయంబత్తూరు, సెప్టెంబర్ 6: ప్రియుడికి ద్విచక్ర వాహనం కొనివ్వాలనే ఉద్దేశంతో తండ్రి స్నేహితుడి ఇంట్లోనే బంగారు ఆభరణాలను చోరీ చేసిన 19 ఏళ్ల కళాశాల విద్యార్థినిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని పొల్లాచ్చిలో చోటుచేసుకుంది. అరెస్టైన యువతిని ఆర్. జాయ్‌ ప్రిన్సీ (19)గా పోలీసులు గుర్తించారు. ఆమె పొల్లాచ్చిలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అసలేం జరిగిందంటే..

పొల్లాచ్చి సమీపంలోని ఉంజవేలంపట్టి ప్రాంతంలో నివసించే హెచ్. తమిళ్‌సెల్వన్‌ (59)కు జాయ్‌ ప్రిన్సీ తండ్రి రాజేష్‌తో స్నేహం ఉంది. ఆ పరిచయంతో జాయ్‌ ప్రిన్సీ తరచూ వారి ఇంటికి వెళ్లివచ్చేది. ఈ క్రమంలో ఆగస్టు 16న జాయ్‌ ప్రిన్సీ తమిళ్‌సెల్వన్‌ ఇంటికి వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే ఆమె వెళ్లిన తర్వాత ఇంట్లోని అల్మారాను పరిశీలించిన తమిళ్‌సెల్వన్‌కు బంగారు ఆభరణాలు కనిపించలేదు. మొత్తం 9 సవరన్ల (సుమారు 72 గ్రాముల) బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో ఆయన పొల్లాచ్చి ఈస్ట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటికి వచ్చిన జాయ్‌ ప్రిన్సీపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

విచారణలో అసలు విషయం వెలుగులోకి..

పోలీసులు జాయ్‌ ప్రిన్సీని విచారించగా ఆమె చోరీ చేసినట్లు అంగీకరించినట్లు ఓ అధికారి తెలిపారు. విచారణలో ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. చోరీ చేసిన బంగారు ఆభరణాలను విక్రయించి నగదు పొందింది. ఆ డబ్బుతో తన ప్రియుడు జనగన్‌ శివ కోసం కొత్త బైక్‌ కొనుగోలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రియుడికి బైక్‌ కొనివ్వాలనే ఉద్దేశంతోనే బంగారు ఆభరణాలను చోరీ చేసినట్లు ఆమె అంగీకరించింది. నేరాన్ని అంగీకరించిన జాయ్‌ ప్రిన్సీని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు ఆమెను రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె కోయంబత్తూరు సెంట్రల్‌ జైలులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ కేసులో జాయ్‌ ప్రిన్సీ ప్రియుడిగా పేర్కొన్న జనగన్‌ శివ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు చేపట్టారు. తండ్రి స్నేహితుడి ఇంట్లోనే బంగారం చోరీ చేసి, ఆ నగదుతో ప్రియుడికి బైక్‌ కొనుగోలు చేసిన ఘటన పొల్లాచ్చిలో చర్చనీయాంశంగా మారింది.

Follow Us