
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ వ్యాఖ్యలు వివాదానికి దారితీసాయి. ఆయన వ్యాఖ్యలను కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం తప్పుపట్టారు. ఆయన ప్రభుత్వ ఏజంట్‌లా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయ నాయకులు ఏం చేయాలో సైన్యాధిపతి చెప్పాల్సిన అవసరం లేదని, ఆయన పని ఆయన చూసుకుంటే చాలని తెలిపారు.
తప్పుడు వాదనలు చేయమని జనరల్ రావత్ వంటి ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం బాధ కలిగించిందని చిదంబరం అన్నారు. “ఇది ఆర్మీ జనరల్ యొక్క పనేనా? ఇది సిగ్గుచేటు” అని ఆయన అన్నారు. “నేను జనరల్ రావత్ కు విజ్ఞప్తి చేస్తున్నాను… మీరు ఆర్మీకి నాయకత్వం వహిస్తున్నప్పుడు, ఆ పనిని బాగా చూసుకుంటారు. రాజకీయ నాయకులు ఏం చేయాలో అదే చేస్తాం” అని తెలిపారు.
కేంద్రానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టిన విద్యార్థులకు మద్దతుగా చిదంబరం మాట్లాడారు. “భారత రాజ్యాంగానికి ఎదురయ్యే ప్రమాదాన్ని వారు అర్థం చేసుకున్నందున భారతదేశ విద్యార్థులు, యువత ఈ చట్టాన్ని వ్యతిరేకించాలని నిర్ణయించుకున్నారు. పౌరసత్వ సవరణ చట్టం, పౌరుల జాతీయ రిజిస్టర్ ముస్లింలకు ప్రత్యక్ష ముప్పుగా పేర్కొన్నారు. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధం అని చిదంబరం స్పష్టంచేశారు.