విప్లవ వేగు చుక్క చెగువేరా.. పేరులోనే ఉత్తేజం, చైతన్యం ప్రవహిస్తుంది..

విప్లవ వేగు చుక్క. పోరాటాల పురిటి బిడ్డ. సాహసానికి మారు పేరు. డాక్టర్‌. రచయిత, కవి, మేధావి, కమ్యూనిస్టు. యుద్ధ సిద్ధాంతకర్త. అన్నింటికీ మించి మానవతావాది. నేటి తరానికి స్ఫూర్తి. మార్గదర్శి చెగువేరా...

విప్లవ వేగు చుక్క చెగువేరా.. పేరులోనే ఉత్తేజం, చైతన్యం ప్రవహిస్తుంది..
Follow us

|

Updated on: Jun 14, 2020 | 3:30 PM

విప్లవ వేగు చుక్క. పోరాటాల పురిటి బిడ్డ. సాహసానికి మారు పేరు. డాక్టర్‌. రచయిత, కవి, మేధావి, కమ్యూనిస్టు. సైనిక వ్యూహకర్త. పాలనాదక్షుడు. దౌత్యవేత్త. గెరిల్లా యోధుడు. యుద్ధ సిద్ధాంతకర్త. అన్నింటికీ మించి మానవతావాది. నేటి తరానికి స్ఫూర్తి. మార్గదర్శి చెగువేరా. చే పేరు చెబితేనే కళ్లముందు ఆయన రూపం కనిపిస్తుంది. ఆకుపచ్చ సైనిక దుస్తులు, తలపై మిలటరీ క్యాప్‌, దానిపై ఐదు కోణాల నక్షత్రం, సన్నని గడ్డం- మీసాలు, తేజోవంతమైన ముఖం.ఒకసారి హవానా చుట్టతో, మరోసారి తల మీద నక్షత్రం బొమ్మతో కనబడే చేగువేరా గురించి ఈ తరం యువత ఆసక్తి చూపుతోంది. విప్లవాన్ని రగిలించి, విప్లవం కోసం జీవించి, విప్లవంలోనే మరణించి, ప్రపంచ విప్లవాలకే వేగుచుక్కగా నిలిచాడు. ఆయన వర్థంతి సందర్భంగా చెగువేరా జ్ఞాపకాలను ఒక్కసారి నెమరు వేసుకుందాం …

సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ వర్గ దోపిడీ నుంచి ప్రజలను విముక్తి చేయాలని జీవించినంత కాలం పరితపించేవారు చే. అంతర్జాతీయ శ్రామికవర్గ పోరాటాలకు ఊపిరులూదిన చే ఇందుకు గెరిల్లా సాయుధ పోరాటమే మార్గంగా ఎంచుకున్నాడు. బొలీవియా సైనిక నియంతకు వ్యతిరేకంగా పోరాడుతూ శత్రుసేనలకు చిక్కి హతమయ్యారు. ప్రజల గుండెల్లో ధృవతారగా నిలిచారు.

విప్లవమే జీవితం…

చేగువేరా అసలు పేరు ఎర్నెస్టో గువేరా సెలా సెర్నా. ఆయన 1928 జూన్‌ 14న అర్జెంటీనాలోని రోజారియో పట్టణంలో జన్మించారు. తండ్రి ఎర్నెస్టో గువేరా లించ్‌. తల్లి సెలియా దెలా సెర్నా. బతుకు దెరువు కోసం ఐర్లాండ్‌ నుంచి స్పెయిన్‌కు, అక్కడ నుంచి అర్జెంటీనాకు వలస వెళ్లింది ఆ కుటుంబం. రెండేళ్ల వయస్సులోనే చేకు ఆస్తమా వచ్చింది. మందులు వాడినా ఉపశమనం తాత్కాలికమే. పెరిగి పెద్దవాడై డాక్టర్‌ పట్టా పొందినా ఆస్తమా ఇబ్బంది పెడుతుండేది. మొండి పట్టుదల, మొక్కవోని దీక్ష ఆయన్ను ముందుకు నడిపించేవి. చిన్నప్పటి నుంచే విప్లవకారుల జీవిత చరిత్రలు, వారి వీర గాథలను తల్లి సెలియా చేకు నూరిపోసేది. పెట్టుబడిదారీ వర్గం, దోపిడీదారీ సమాజం గురించి తెలుసుకోవడం ప్రారంభించాడు చే. తల్లిదండ్రుల విప్లవ మార్గం చే పై ప్రభావం చూపింది. అదే బాటలో తాను పయనించాలనుకున్నాడు. అర్జెంటీనాలో పుట్టి లాటిన్‌ అమెరికా దేశాన్నంతటినీ తిరిగి వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకున్నాడు. ఇంజనీరింగ్‌ విద్యలో చేరినా చేగువేరాను ఆనాటి అంతర్జాతీయ పరిణామాలు ఆసక్తి కలిగించాయి. ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా తల్లిదండ్రుల పోరాటం ఆయన్ను ముందుకు కదిలేలా చేశాయి. వైద్యుడైతే ప్రజా సేవతో అందరినీ కలవొచ్చనుకున్నాడు. అంతే ఇంజనీరింగ్‌ విద్యను మధ్యలోనే వదిలి స్టెతస్కోప్‌ పట్టాడు. మొత్తం ఎనిమిది నెలలపాటు అర్జెంటీనా యాత్ర చేశాక చే ఆలోచనలో మార్పు వచ్చింది. ప్రపంచానికి తాను ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. అంతే కర్తవ్యం దిశగా కార్యరంగంలోకి దూకాడు. ఈ సమయంలో లాటిన్‌ అమెరికా దేశాలు చూసేందుకని చేగువేరా 1953, జూలై 7న బ్యూనస్‌ ఎయిర్స్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరారు.

సామాజిక డాక్టరు…

అమ్మనాన్నలు చేకు వీడ్కోలు పలికారు. అతను వెళుతోంది డాక్టర్‌గా కాదు… సమాజానికి పట్టిన రోగానికి శాశ్వత చికిత్స చేసేందుకు. అందుకే చే విప్లవకారుని అవతారమెత్తాడు. గ్వాటెమాలలో కొన్నాళ్లపాటు రహస్య జీవితం గడిపిన చే అక్కడి సైనిక నియంతకు వ్యతిరేకంగా పోరాడారు. అక్కడే విప్లవ పార్టీ సభ్యురాలు హిల్దా అకోస్టా పరిచయమైంది. కొద్ది కాలంలోనే వారి పరిచయం ప్రేమగా మారింది. పెళ్లికి దారితీసింది. వారికి పుట్టిన అమ్మాయి పేరే హిల్దితా.

గ్వాటెమాల అధ్యక్షులు ఆర్బెంజ్‌ గుజ్‌మెన్‌కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చే, అతని భార్య హిల్దాలు పాల్గొన్నారు. చేను విప్లవకారునిగా, హంతకునిగా ముద్రవేసిన సైనికులు అతన్ని చాకచక్యంగా పట్టుకున్నారు. సైనిక నియంత వద్దకు అతన్ని తీసుకు వెళ్లేలోపే తప్పించుకున్నాడు చే. హిల్దా జైలులో ఉన్నా.. కొద్దికాలం తర్వాత విడుదలైంది. తర్వాత గ్వాతెమాలా సరిహద్దులు దాటిన చే.. మెక్సికో వైపు అడుగులు వేశాడు. అక్కడే క్యూబా విప్లవ వీరులు ఫైడల్‌ కాస్ట్రో, రావుల్‌ కాస్ట్రోలతో పరిచయం ఏర్పడింది. తాను క్యూబా విముక్తి పోరాటంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు చే. ఇందుకు కాస్ట్రో అనుమతి లభించింది. గ్రాన్మా అనే చిన్న పడవలో హవానా వైపు బయలుదేరిన 20 మంది విప్లవీరులను సైన్యం చుట్టుముట్టింది. వారిలో ఇద్దరినీ హతమార్చింది. మరికొందరిని పట్టుకునే ప్రయత్నం చేసినా.. తప్పించుకున్నారు గెరిల్లా దళసభ్యులు. ఈ సంద్భంగా సైన్యం, గెరిల్లా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో చేగువేరా భుజానికి గాయమైంది. మెడకు తుపాకీ బానెట్‌ దెబ్బ తగిలింది. అయినా లెక్కచేయక సైనికులతో పోరాడాడు చే. నెత్తుటి గాయం బాధిస్తున్నా లెక్క చేయలేదు. శత్రు సైన్యాన్ని తరిమికొట్టాడు. తాత్కాలిక విజయం సాధించడంలో చే కృషి వెలకట్టలేనిది. ఒక్కో పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగుతున్న విప్లవవీరులు హవానా చేరుకుని సంబరాలు జరుపుకున్నారు.

క్యూబా బాధ్యతలు…

అమెరికా కీలు బొమ్మ అధ్యక్షుడు బటిష్టా ఓటమిని ఒప్పుకున్నాడు. దేశం విడిచి వెళ్లాడు. ఫలితంగా 1959 జనవరి 1న ఫైడల్‌ కాస్ట్రో నాయకత్వాన ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. క్యూబాలో ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధానిగా ఫైడల్‌ కాస్ట్రో బాధ్యతలు తీసుకున్నారు. విదేశాంగ వ్యవహారాలతో పాటు.. ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే కర్తవ్యాన్ని చేకు అప్పగించారు కాస్ట్రో. అదే రోజు క్యూబా రాజ్యాంగం ప్రకారం చేగువేరాకు ఆ దేశ పౌరసత్వం ఇస్తున్నట్లు ప్రకటించింది. విదేశీ వ్యవహారాల్లో భాగంగా చేగువేరా 1959 జూన్‌ 12 నుంచి సెప్టెంబరు 14 వరకు 14 దేశాల రాజ్యాధినేతలతో చర్చలు జరిపారు. చే చర్చలు జరిపిన వారిలో భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరాగాంధీనే కాదు.. ఈజిప్టు, ఇండోనేషియా, పాకిస్తాన్‌, యుగోస్లోవియా దేశాల అధ్యక్షులు ఉన్నారు. విదేశాల్లో తిరగడం, వాతావరణం అనుకూలించకపోవడం చే ఆరోగ్యం పై ప్రభావం చూపింది. ఫలితంగా ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఈ సమయంలోనే చేగువేరా గెరిల్లా యుద్ధం అనే పుస్తకాన్ని రాశారు.

కమ్యూనిస్టు కంచుకోటలైన చైనా, రష్యా దేశాల్లో చేగువేరా పర్యటించారు. అక్కడి నేతలతో చర్చలు జరిపి కార్మికులు, కర్షకుల కోసం ఆయా ప్రభుత్వాలు అమలు చేస్తున్న చర్యలను పరిశీలించారు. క్యూబాలోను అలాంటి ప్రణాళికలు అమలు అయ్యేలా చూడాలని కాస్ట్రోను కోరడం విశేషం. ప్రభుత్వ ఆదేశాల మేరకు చే 1964 డిసెంబర్‌ 11న క్యూబా ప్రతినిధిగా ఐక్యరాజ్య సమితిలో అడుగు పెట్టాడు. సభ్య దేశాల ప్రతినిధులనుద్దేశించి ప్రసంగించారు. వచ్చిన అవకాశాన్ని అమెరికా సామ్రాజ్యవాదాన్ని తిప్పికొట్టే సాహసం చేశారు. అటు తర్వాత చేగువేరా అల్జీరియా పర్యటించారు. అల్జీరియా పర్యటన ముగించుకుని వచ్చిన చే హవానాలో చివరిగా కాస్ట్రోను కలిశాడు. క్యూబా విముక్తితో తన పని పూర్తి కాలేదని చెప్పారు. మరో దేశ విముక్తి పోరాటంలో పాల్గొంటానని వివరించారు. ఇందుకు కాస్ట్రో అభ్యంతరం చెప్పినా.. తన కర్తవ్య దీక్షను వీడేది లేదని పట్టుపట్టాడు చేగువేరా. మరో మార్గం లేక కాస్ట్రో అతనికి అడ్డుచెప్పలేదు.

కాంగో, బొలివియా విముక్తి పోరులో…

కాంగో విముక్తి కోసం చెగువేరా వెళ్లిన విషయం కాస్ట్రో, రౌవుల్‌ కాస్ట్రోతో పాటు… కుటుంబ సభ్యులకే తెలుసు. చివరగా కుటుంబ సభ్యులతో కలిసి విందులో పాల్గొన్నాకే కాంగోలో అడుగుపెట్టారు చే. అక్కడి సైనిక నియంతకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు రహస్యంగా యుద్ధ తంత్ర వ్యూహాలు రచించారు చే. ఇందుకు స్థానిక విప్లవకారుల సహకారం తోడైంది. కొద్దికాలంపాటు.. పోరాటం చేసినా.. సైనిక నియంతల ఆగడాల ముందు విప్లవవీరుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. విప్లవవీరులు ఒక్కొక్కరుగా సైన్యం చేతికి చిక్కారు. మిగిలిన కొద్ది మందితో కలిసి చేగువేరా తిరిగి హవానా చేరుకున్నారు. అక్కడ జరిగిన విషయాలను కాస్ట్రోకు వివరించాడు చే. ఈసారి కాంగోకు బదులు.. బొలీవియాను ఎంచుకున్నాడు తన కేంద్రంగా. 1966 అక్టోబరు 23న చేగువేరా తన జీవితంలోని చివరిగా కాస్ట్రోను రహస్యంగా కలిశారు. వేషం, భాష మార్చి ప్యాంట్‌, పొడవాటి షర్ట్‌తో ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. ఉరుగ్వే మీదుగా బొలీవియా చేరుకున్నారు. క్యూబా విప్లవవీరులు, బొలీవియా కమ్యూనిస్టు పార్టీ సభ్యులు, స్థానికుల సహకారం తోడైంది.

నేలకొరిగిన విప్లవ సింహం…

బొలీవియాలోని వాల్లె సెర్రానోలో గెరిల్లా దళాలను చుట్టుముట్టిన సైన్యం తుపాకీ గుళ్ల వర్షం కురిపించింది. చే వర్గం ధీటుగా తిప్పికొట్టే సాహసం చేసినా… సైన్యాలదే పై చేయి అయింది. అమెరికా సైన్యం వద్ద శిక్షణ పొందిన బొలీవియా సైన్యం ధాటికి చే గెరిల్లా దళం నిలవలేకపోయింది. తన అనుచరులు ఒక్కొక్కరుగా నేలకొరగడం చేను కదిలించింది. అయినా ముందుకే దూకాడు. వందల సంఖ్యలో ఉన్న సైన్యం చే గువేరా కుడి మోకాలుపై కాల్చింది. మరో తూటా భుజం నుంచి దూసుకుపోయింది. తరువాత చేను పెడ రెక్కలు విరిచి కట్టి హెలికాప్టర్‌లో ఎక్కించాడు. లా హిక్విరా ప్రాంతానికి ఆయనతోపాటు… నలుగురు గెరిల్లా సభ్యులను తీసుకువెళ్లాడు. అక్కడి స్కూలు భవనంలో బంధించారు. సైనికాధికారి రోడ్రిగ్వెజ్‌ ఆదేశాలతో సార్జెంట్‌ టెరాన్‌ చే గుండెలపై గురి చూసి కాల్చాడు. అంతే విప్లవ వేగు చుక్క నేలకొరిగింది. ఎర్రపూల వనంలో విప్లవ పువ్వు రాలింది. ఎప్పుడు మరణం సమీపించినా… స్వాగతం పలుకుతానన్న చేగువేరా మాటలు… క్యూబా ప్రజలనే కాదు… విప్లవ వీరుల చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. చే గువేరాను చంపడం ద్వారా విప్లవాన్ని అంతం చేయాలనుకున్నా… ప్రపంచవ్యాప్తంగా ఆ జ్యోతి రగిలింది. విప్లవం ఉన్నంతకాలం చే గువేరా సాహసాలు, పట్టుదల బ్రతికే ఉంటాయి. ఈ విప్లవవీరుడు మన ముందు లేకపోయినా ఆయన ఆశయాలు ఎప్పటికి బ్రతికే ఉంటాయనేది నిజం. క్యూబా, రష్యా, కొరియా, చైనా, వియత్నాం, పోలెండ్, రుమేనియా, చెక్ రిపబ్లిక్, అల్బేనియా, హంగేరి, మాసిడోనియా, బల్గేరియా, లాత్వియా, ఉక్రెయిన్, కజికిస్థాన్ వంటి దేశాల కమ్యూనిస్టు యోధులకు చేగువేరా పోరాటం ఆదర్శం. అందుకే చే జీవిత చరిత్రను తమ పాఠశాలల్లో పాఠాలుగా బోధిస్తోంది. అంతెందుకు భారత్ లోని కేరళ, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోను చేగువేరా చరిత్రను భవిష్యత్ తరాలకు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జీవితాంతం ప్రజల బాగు కోసం పరితపించిన వేగు చుక్క కామ్రేడ్ చేకు విప్లవ వందనాలు.

కొండవీటి శివనాగ్ రాజు సీనియర్ జర్నలిస్టు, టీవీ-9

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..