మోదీ నేతృత్వంలో రెండోసారి అధికారం చేపట్టిన ఎన్డీయే ప్రభుత్వం.. కొన్ని శాఖల్లో మార్పులు చేర్పులు చేసింది. జలవనరులు, తాగునీటికి సంబంధించిన రెండు మంత్రిత్వ శాఖలను కలుపుతూ జల్ శక్తి మంత్రిత్వ శాఖగా మార్చేసింది. కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన గజేంద్ర షెఖావత్‌కు ఈ మంత్రిత్వ శాఖను అప్పగించారు. ఇకపై జలవ్యవహారాలన్నీ ఈ శాఖ కిందికే రానున్నాయి. అంతర్జాతీయ జల వివాదాలైనా, దేశీయ జలవివాదాలైనా ఈ శాఖే చూడాల్సి ఉంటుంది. అలాగే నీటి పారుదల రంగం, నమామి గంగ ప్రాజెక్ట్, నీటి సరఫరా తదితరాలు కూడా ఈ శాఖ కిందికే రానున్నాయి. కాగా జల్‌శక్తి కింద నదుల అనుసంధానం, తుంపర సేద్యం అమలు, ప్రతి ఇంటికి నల్లా నీరు వంటివి అమలు చేస్తామంటూ ఎన్నికలకు ముందు బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొన్న విషయం తెలిసిందే.